ఫిష్ వెంకట్ కు రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు

 
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు చెడిపోయి, నడవలేని దయనీయ స్థితిలో ఉన్నారు. ఏడాదిగా ఆయనకు సినిమాలు కూడా లేవు. ఓ ఇంటర్వ్యూలో ఆయన తన దీనస్థితిని వెల్లడించారు. ఈ నేపథ్యంలో, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఉదారంగా స్పందించారు. ఫిష్ వెంకట్ కు రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు. 

చదలవాడ శ్రీనివాసరావు తరఫున ఆర్థిక సాయం తాలూకు చెక్కును టీఎఫ్ పీసీ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, టీఎఫ్ పీసీ ట్రెజరర్, నిర్మాత రామసత్యనారాయణ,  దర్శకుడు కె. అజయ్ కుమార్ ,తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్... ఫిష్ వెంకట్ కు అందించారు. 

ఈ సందర్భంగా టీఎఫ్ పీసీ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... "నిజానికి ఫిష్ వెంకట్ గారు సహాయం అడగకుండానే ఆయన పడుతున్న ఇబ్బంది తెలుసుకొని చదలవాడ శ్రీనివాసరావు గారు మా ద్వారా లక్ష రూపాయల చెక్కును అందించమని కోరారు. గతంలో కూడా చదలవాడ శ్రీనివాసరావు గారు ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. కోవిడ్ టైంలో ఇండస్ట్రీలో ఎంతోమంది వర్కర్స్ కి సపోర్ట్ గా నిలబడ్డారు. చిత్రపురి కాలనీ ద్వారా ఎంతో మంది వర్కర్స్ అక్కడ నివసించడానికి ఆయన వంతు సహాయం అందించి ఎంతో మంది జీవితాలని నిలబెట్టారు" అని వివరించారు. 

టీఎఫ్ పీసీ ట్రెజరర్, నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ... "మా చదలవాడ శ్రీనివాసరావు గారు ఎక్కడో వీడియోలో, ఫిష్ వెంకట్ గారు పడుతున్న ఇబ్బంది చూసి ఆర్థిక సహాయార్థం లక్ష రూపాయలు అందించారు. అడిగితేనే సహాయం చేయలేని ఈ రోజుల్లో అడక్కుండానే సహాయం చేసే ఆయన్ని దేవుడుగా భావించవచ్చు. అడగకుండానే కష్టం తెలుసుకొని ఇంతటి సహాయం చేసిన చదలవాడ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము" అని పేర్కొన్నారు. 

ఫిష్ వెంకట్ మాట్లాడుతూ... "నా కష్టాన్ని తెలుసుకుని అడగకుండానే లక్ష రూపాయలు సహాయం అందించిన చదలవాడ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన చేసిన ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను నా కుటుంబం ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఇలాగే ఆయన ఇంకా ఎంతో మందికి సేవ చేసే విధంగా ఆ దేవుడు ఆశీస్సులు ఆయనపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.


More Telugu News