మేడారం ప్రాంతంలో టోర్నడో బీభత్సంపై స్పందించిన మంత్రి సీతక్క

  • అడవిలో సుడిగాలి రావడంతో వృక్ష సంపద నేలకొరిగిందన్న మంత్రి
  • వేలసంఖ్యలో వృక్షాలు నేల కూలిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం
  • మేడారం అమ్మవార్ల దయతో సుడిగాలి గ్రామాల్లో రాలేదన్న మంత్రి
ములుగు జిల్లాలో టోర్నడో బీభత్సంపై మంత్రి సీతక్క స్పందించారు. అడవిలో సుడిగాలి రావడంతో ఎంతో వృక్ష సంపద నేలకొరిగిందని, కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం అదృష్టమన్నారు. 

ములుగు అటవీ ప్రాంతంలో 500 ఎకరాల్లో చెట్లు నేలకూలడంపై మంత్రి ఇవాళ తెలంగాణ సచివాలయం నుంచి పీసీసీఎఫ్‌, డీఎఫ్ఓ, స్థానిక అధికారుల‌తో ఫోన్ ద్వారా మాట్లాడారు. వేల సంఖ్యలో వృక్షాలు నేల కూలిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...  రెండు రోజుల క్రితమే చెట్లు నెల‌కొరిగిన ప్రాంతాన్ని సంద‌ర్శించినప్పటికీ, ఈ స్థాయిలో వేలాది చెట్లు కూలిపోయినట్టు ఊహించ‌లేద‌న్నారు. జరిగిన న‌ష్టాన్ని డ్రోన్ కెమెరాల సాయంతో అంచ‌నా వేసే క్రమంలో జరిగిన విధ్వంసం బయటపడిందని తెలిపారు. 

ఘటన ప్రాంతాన్ని సందర్శించి పీసీసీఎఫ్‌ నివేదిక సిద్ధం చేస్తున్నారని తెలిపారు. అడవిలో సుడిగాలి వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం అదృష్టమన్నారు.

ఈ సుడిగాలి గ్రామాల్లో సంభవించి ఉంటే కనుక పెను విధ్వంసం జరిగి ఉండేదన్నారు. స‌మ‌క్క, సార‌ల‌మ్మ త‌ల్లుల ద‌య వ‌ల్లే సుడిగాలి ఊర్ల మీద‌కు మళ్లలేదన్నారు. ఆ అమ్మవార్ల దీవెన‌తోనే ప్రజలు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డార‌ని తెలిపారు. 

చెట్లు నేలకూలడంపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలను పంపించి పరిశోధన జరిపించి కారణాలు గుర్తించేలా చొరవ తీసుకోవాలన్నారు. మరలా చెట్లు పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయించాలన్నారు.


More Telugu News