అమరావతి మునిగిందన్న వాళ్లను పూడ్చిపెట్టాలి: సీఎం చంద్రబాబు

  • వరద సహాయక చర్యల్లో చంద్రబాబు ఫుల్ బిజీ
  • వరదలపై ప్రజలను భయపెట్టేలా వైసీపీ విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం
  • ఇలాంటి దుర్మార్గులకు రాష్ట్రంలో ఉండే అర్హత లేదని వ్యాఖ్యలు
  • ఇలాంటి వాళ్లను సంఘ బహిష్కరణ చేయాలని పిలుపు
ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో వరద సహాయక చర్యల పర్యవేక్షణలో తలమునకలుగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీపై ధ్వజమెత్తారు. అమరావతి మునిగిందన్న వాళ్లను పూడ్చిపెట్టాలని అన్నారు. వరదలపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా? ఇలాంటి దుర్మార్గులకు రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయ నేరస్తులను, తప్పుడు ప్రచారం చేసేవాళ్లను సంఘ బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. 

ప్రజల కోసం పాటుపడుతుంటే రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు... ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు రాక్షసులతో పోరాడుతున్నా... క్షమాపణ చెప్పేవరకు వాళ్లను విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. 

బుడమేరు గండ్లు ఇంకా పూడ్చాల్సి ఉందని చంద్రబాబు వెల్లడించారు. విజయవాడకు బుడమేరు ఓ సమస్యగా మారిందని అన్నారు. కృష్ణా నది కంటే బుడమేరుతోనే విజయవాడకు తీవ్ర నష్టం అని తెలిపారు. బుడమేరు వాగును ఆక్రమించారని, 2019 నుంచి ఆక్రమణలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం గాడిదలు కాసిందా? అంటూ మండిపడ్డారు. 

బుడమేరు ఆక్రమణలపై సర్వే చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం కుడి ప్రధాన కాల్వ గట్లను కూడా తవ్వేశారని తెలిపారు. వైసీపీ తప్పులకు అమాయకులు వేదనకు గురయ్యారని, ఓ వ్యక్తి అహంభావానికి ప్రజలు ఇబ్బందులు పడాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. అందరికీ నాణ్యమైన ఆహారం అందజేస్తామని, ముంపు ప్రాంతాల్లో ఆహారంతో పాటు తాగునీరు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. 8 లక్షల వాటర్ బాటిల్స్ అందించామని చెప్పారు. కొన్ని చోట్ల మున్సిపల్ వాటర్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. అధికారులందరూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని వివరించారు.

వరద బాధితులందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడానని, వరద ప్రాంతాల్లో పర్యటించాలని కోరానని వెల్లడించారు. 

రేపు ఉదయానికి వరద పూర్తిగా తగ్గిపోతుందని భావిస్తున్నామని వెల్లడించారు. కృష్ణా నదికి మరో 40 వేల క్యూసెక్కుల వరద వస్తే విజయవాడకు మరింత ప్రమాదం అని అన్నారు.


More Telugu News