హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేస్తే సమాచారం ఇవ్వండి: ఏసీబీ

  • పాత నోటీసులు చూపించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు
  • పలుచోట్ల బాధితులు ఫిర్యాదులు చేశారన్న ఏసీబీ
  • డబ్బులు డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచన
హైడ్రా అధికారులమని చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) తెలిపింది. చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గత కొన్నిరోజులుగా హైడ్రా కూల్చివేతలు చేపడుతోంది. ఇదే సమయంలో పాత నోటీసులను చూపించి కొంతమంది తాము హైడ్రా అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

వీటిపై ఏసీబీ స్పందించింది. కొందరు ప్రయివేటు వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, హైడ్రా అధికారులమని పాత నోటీసులు చూపించి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు గుర్తించామని ఏసీబీ తెలిపింది.

ఇలాంటి ఘటనలపై పలుచోట్ల బాధితులు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పేర్కొంది. తమ దృష్టికి తీసుకువచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపింది.


More Telugu News