అందాల మీనాక్షికి అదృష్టం మొదలైనట్టే!

  • చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి
  • 'ఖిలాడీ' సినిమాతో దక్కిన గుర్తింపు 
  • కెరియర్లో పెద్ద సినిమాగా 'ది గోట్' 
  • లైన్లో మరో రెండు సినిమాలు  

కథానాయికలకు ఉండవలసిన మొదటి అర్హత అందమే. ఆ తరువాత కొద్దిగా అభినయం తెలిస్తే సరిపోతుంది. అందంగా ఉన్న వాళ్లంతా కథానాయికలు కాలేరు. హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్లందరూ స్టార్ డమ్ ను సంపాదించుకోలేరు. అందుకు అందంతో పాటు .. అభినయంతో పాటు  అదృష్టం కూడా తోడుకావాలి. అలాంటి అదృష్టం మీనాక్షి చౌదరి కెరియర్లో అడుగుపెట్టినట్టుగానే కనిపిస్తోంది.

మీనాక్షి చౌదరి ఎలాంటి హడావిడి లేకుండా తెలుగులో చేసిన మొదటి సినిమా  'ఇచ్చటవాహనములు నిలుపరాదు'. ఆ తరువాత రవితేజ సరసన ఆమె 'ఖిలాడీ' సినిమాలో మెరిసింది. ఈ సినిమా సక్సెస్ కాలేదు .. కాకపోతే ఆమె గ్లామర్ టచ్ ఆడియన్స్ కి గుర్తుండిపోయింది. ఆ తరువాత చేసిన 'హిట్ 2' సక్సెస్ ఆమెను మరో మెట్టు ఎక్కించింది. ఈ నేపథ్యంలోనే ఆమె 'గుంటూరు కారం' చేసింది. 

'గుంటూరు కారం'లో మహేశ్ బాబు మరదలుగా మీనాక్షి కనిపించింది. ఈ సినిమాలో ఆమె పాత్రకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. కానీ అంతకుముందు కంటే ఈ సినిమాలో ఆమె చాలా అందంగా కనిపించింది. ఆమెను మెయిన్ హీరోయిన్ గా తీసుకోవచ్చనే నమ్మకాన్ని కలిగించినది ఈ సినిమానే. ఏదో అలా నెమ్మదిగా పుంజుకుంటుందేమోనని అనుకుంటున్న సమయంలో ఆమె ఏకంగా విజయ్ సినిమా 'ది గోట్'లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.

మీనాక్షి కెరియర్లో ఇదే పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు. విజయ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడమనేది అంతతేలికైన విషయమేం కాదు. రేపు ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా హిట్ కొడితే మీనాక్షి గ్రాఫ్ ఒక రేంజ్ లో పెరిగిపోవడం ఖాయం. విష్వక్ జోడీగా ఆమె చేసిన 'మెకానిక్ రాకీ' .. వరుణ్ తేజ్ సరసన చేసిన 'మట్కా' కూడా అక్టోబర్లో విడుదల కానున్నాయి. ఈ సినిమాలతో మీనాక్షి నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందనే అనిపిస్తోంది మరి. 



More Telugu News