హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలుకే.. రంగనాథ్ హెచ్చరిక

  • అమీన్ పూర్ లో బిల్డర్ కు ఓ వ్యక్తి బెదిరింపులు
  • హైడ్రా చీఫ్ తనకు క్లోజ్ అంటూ పరిచయం
  • రూ. 20 లక్షలు ఇవ్వాలని లేదంటే నిర్మాణాలు కూల్చేయిస్తానని వార్నింగ్
  • అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు
‘హైడ్రా చీఫ్ రంగనాథ్ నాకు బాగా క్లోజ్.. రూ.20 లక్షలు ఇస్తే హైడ్రా బుల్డోజర్లు మీ నిర్మాణాల జోలికి రాకుండా చూస్తా.. లేదంటే కూల్చేయిస్తా’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక కార్యకర్తనని, సామాజిక సేవకుడినని చెప్పుకుంటూ విప్లవ్ సిన్హా అనే వ్యక్తి అమీన్ పూర్ లో బిల్డర్లను బెదిరించాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే మీడియాలో మీ నిర్మాణాల గురించి అసత్యాలు రాయించి, హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో బిల్డర్లు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం హైడ్రా చీఫ్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. 

దీనిపై రంగనాథ్ స్పందించారు. హైడ్రా పేరుతో కానీ, అధికారుల పేరుతో కానీ బెదిరింపులకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. చెరువుల ఆక్రమణలను తొలగిస్తూ ప్రజల అభిమానం చూరగొన్న హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోమని చెప్పారు. హైడ్రా విభాగాన్ని నీరుగార్చేలా చేసినా, అధికారులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తమ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులను, ఏసీబీ అధికారులను సంప్రదించాలని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. 

అసలేం జరిగిందంటే..
అమీన్ పూర్ లో ఓ బిల్డర్ భారీ నిర్మాణం చేపట్టారు. అన్ని అనుమతులతో నిర్మాణ పనులు చేపట్టగా.. విప్లవ్ సిన్హా అనే వ్యక్తి ఫోన్ చేశాడని బిల్డర్ చెప్పారు. హైడ్రా మీ నిర్మాణాల జోలికి రాకూడదంటే తాను అడిగిన సొమ్ము ముట్టజెప్పాలని, రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడన్నారు. సిన్హా ఫోన్ కాల్ తో ఆందోళనకు గురైన సదరు బిల్డర్.. పిస్తా హౌస్ వద్దకు వెళ్లి సిన్హాను కలుసుకున్నారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ తనకు తెలుసని, అమీన్ పూర్ లో ఏ విషయమైనా రంగనాథ్ తననే అడుగుతారంటూ సిన్హా చెప్పాడన్నారు. రంగనాథ్ తో కలిసి ఉన్న ఫొటోలను చూపించి డబ్బులు డిమాండ్ చేశాడన్నారు. దీంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని బిల్డర్ వివరించారు.


More Telugu News