వరద సాయం ప్రకటనపై తెలంగాణ ఉద్యోగుల్లో అసంతృప్తి.. ఎవరిని అడిగారంటూ నిలదీత!

  • ఒకరోజు వేతనం విరాళం ఇస్తామంటూ ఉద్యోగ సంఘాల నేతల ప్రకటన
  • డీఏ బకాయిలు, పీఆర్సీ గురించి అడగరు కానీ విరాళం గురించి ప్రకటనలా? అంటూ నిలదీత 
  • ఉద్యోగ సంఘాల నేతలకు వెల్లువెత్తుతున్న ఫోన్లు
ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిల గురించి నోరెత్తరు కానీ ఎవరినీ సంప్రదించకుండానే గొప్పగా వరద సాయంపై ప్రకటన చేశారంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక రోజు వేతనాన్ని వరద బాధితులకు సాయంగా ఇస్తామంటూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ఉద్యోగులు నేరుగా ఉద్యోగ సంఘాల నేతలకే ఫోన్ చేసి మండిపడుతున్నారు. వరద బాధితులకు సాయం అందించడం వ్యక్తిగతమని, ఎంతివ్వాలి, ఎలా ఇవ్వాలనేది ఎవరికి వారు నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. తమ తరఫున విరాళం ప్రకటించే ముందు కనీసం తమను సంప్రదించాల్సిందని మండిపడుతున్నారు.

డీఏ బకాయిల గురించి కానీ సరెండర్ లీవుల బిల్లుల గురించి కానీ పీఆర్సీ గురించి కానీ ప్రభుత్వాన్ని ఎందుకు అడగరంటూ ఉద్యోగులు నిలదీస్తున్నారు. ఉద్యోగుల సమస్యల గురించి నోరెత్తకుండా ఇప్పుడు ఎవరి మెప్పు కోసం గొప్పగా ప్రకటన చేశారని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పలువురు ఉద్యోగులు తమ అసంతృప్తిని వెలిబుచ్చుతున్నారు. రెండు నెలల క్రితం బదిలీ అయిన ఉద్యోగులకు సగం నెల జీతం ఇంకా ఇవ్వనేలేదని గుర్తుచేశారు. తమను సంప్రదించకుండా, అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా విరాళంపై ప్రకటన చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News