ఏపీ, తెలంగాణ‌కు మాజీ చీఫ్ జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ విరాళం

  • ఇరు రాష్ట్రాల‌కు రూ. 10ల‌క్ష‌ల చొప్పున విరాళం ప్ర‌క‌టించిన మాజీ చీఫ్ జ‌స్టిస్
  • ఢిల్లీలో ఏపీ, తెలంగాణ భ‌వ‌న్‌ల రెసిడెంట్ క‌మిష‌నర్ల‌కు చెక్కుల‌ అంద‌జేత‌
  • ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు తోచిన సాయం చేయాల‌ని పిలుపు
ఎడ‌తెరిపిలేని వ‌ర్షాల‌తో రెండు తెలుగు రాష్ట్రాలు గ‌జ‌గ‌జ వ‌ణికిన విష‌యం తెలిసిందే. లోత‌ట్టు ప్రాంతాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. ఇప్ప‌టికీ కొన్ని ప్రాంతాలు జ‌ల‌దిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. చాలా మంది నిరాశ్ర‌యుల‌య్యారు. దీంతో ఏపీ, తెలంగాణ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు త‌మవంతు సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. 

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ విరాళం అంద‌జేశారు. ఇరు రాష్ట్రాల‌కు రూ. 10 ల‌క్ష‌ల చొప్పున విరాళం ఇచ్చారు. ఈ విరాళాల తాలూకు చెక్కుల‌ను ఆయ‌న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ భ‌వ‌న్‌ల రెసిడెంట్ క‌మిష‌నర్ల‌కు అంద‌జేశారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు తోచిన స‌హాయం చేస్తే బాగుంటుంద‌న్నారు. స‌మాజం కోసం అంద‌రూ ముందుకు వ‌చ్చి ఆదుకోవాల‌ని పిలుపునిచ్చారు. అలాగే కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం కూడా తెలుగు రాష్ట్రాల‌ను ఉదారంగా ఆదుకోవాల‌ని ఎన్‌వీ ర‌మ‌ణ కోరారు.


More Telugu News