పారాలింపిక్స్ లో భారత్ కు పతకాల పంట.. 20కి చేరిన మెడల్స్

  • టోక్యో పారాలింపిక్స్ లో 19 పతకాల రికార్డు బ్రేక్
  • మంగళవారం ఒక్కరోజే దేశానికి ఐదు మెడల్స్ అందించిన ఆటగాళ్లు
  • షూటింగ్ లో అదరగొట్టిన భారత అథ్లెట్లు
ప్యారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దేశానికి పతకాల పంట పండిస్తున్నారు. షూటింగ్ లో మొదలైన పతకాల వేట అదే జోరులో కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే దేశానికి ఐదు పతకాలు వచ్చాయి. దీంతో దేశానికి వచ్చిన పతకాల సంఖ్య 20 కి చేరింది. 2021లో టోక్యోలో జరిగిన పారాలింపిక్స్ గేమ్స్ లో భారత అథ్లెట్లు 19 పతకాలు సాధించి రికార్డు సృష్టించారు. తాజాగా ఈ రికార్డు బద్దలైంది. ఇంకా నాలుగు పోటీల్లో భారత అథ్లెట్లు పాల్గొనాల్సి ఉండడంతో దేశానికి మరో ఐదు పతకాలు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఇండియాకు 3 స్వర్ణాలు, 7 రజతం, 10 కాంస్య పతకాలు వచ్చాయి.

మంగళవారం జరిగిన పోటీల్లో తెలుగు తేజం మహిళల 400 మీటర్ల పరుగుపందెంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నారు. ఇక ఆర్చరీలో పూజా ఖన్నా క్వార్టర్ ఫైనల్స్ లోనే వెనుదిరిగారు. జావెలిన్ త్రో (పురుషులు) లో అజీత్ సింగ్, సుందర్ గుర్జార్ అద్భుతమైన ప్రతిభ చూపి వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. దీంతో భారత్ కు మరో రజతం, కాంస్య పతకాలు వచ్చాయి. పురుషుల హైజంప్ పోటీల్లో శరద్ కుమార్ రజత పతకం సాధించగా.. మరియప్పన్ థంగవేలు కాంస్య పతకాన్ని సాధించి పెట్టారు. మొత్తంగా 20 పతకాలతో ప్యారిస్ పారాలింపిక్స్ లో భారత్ 17వ స్థానంలో నిలిచింది.


More Telugu News