మా నాన్నకి మెంటల్.. యువరాజ్ సింగ్ పాత వ్యాఖ్యలు వైరల్

  • గతంలో ఓ ఇంటర్వ్యూలో యూవీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు
  • తన తండ్రికి మానసిక సమస్య ఉందనుకుంటున్నానన్న యువరాజ్
  • ఇటీవలే ఎంఎస్ ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేసిన యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్
తన కొడుకు క్రికెట్ కెరీర్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాశనం చేశాడని, దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’కి అతడు సంపూర్ణ అర్హుడంటూ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీని తాను క్షమించబోనని అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో.. తన తండ్రికి మెంటల్ ఉందంటూ యువరాజ్ సింగ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

‘‘ మా నాన్నకు మానసిక సమస్య ఉంది’’ అంటూ యువరాజ్ సింగ్ అంగీకరిస్తున్నట్టుగా ఈ వీడియో ఉంది. రణవీర్ అల్లాబాడియా అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూవీ ఈ వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 4, 2023న జరిగిన ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ అయింది. 

కాగా తన తండ్రికి మానసిక సమస్య ఉందని తాను భావిస్తున్నానని, అయితే ఆ విషయాన్ని ఆయన అంగీకరించరంటూ ఆ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ చెప్పాడు. తన తండ్రి తన జీవితంలో విజయవంతం అయ్యారని, అయితే కొన్ని విషయాలను ఆయన అంగీకరించబోరని చెప్పాడు.

యోగ్‌రాజ్ ఏమన్నారంటే?
క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ తన కొడుకు కెరీర్‌ను నాశనం చేశాడని, యూవీ క్రికెట్ జీవితాన్ని కనీసం నాలుగేళ్లు తగ్గించాడని యోగ్‌రాజ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. యువరాజ్ సింగ్ సీనియర్ జాతీయ జట్టుకు చాలా సహకారం అందించాడని, అతడొక అసమాన ఆల్‌రౌండర్ అని పొగిడారు. ఇద్దరూ జాతీయ జట్టుకు ఆడుతున్న సమయంలో యూవీ కెరీర్‌ను ధోనీ ఇబ్బందుల్లోకి నెట్టాడని ఆరోపించారు. గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా యువరాజ్ సింగ్ లాంటి క్రికెటర్ మరొకరు ఉండరని అన్నారని, ఎంఎస్ ధోనీని తాను క్షమించబోనని అన్నారు.


More Telugu News