వాట్సాప్ గ్రూపుగా మొదలై.. రూ. 6200 కోట్ల సంస్థగా ఎదిగిన ‘డుంజో’ పరిస్థితి ఇప్పుడు ఇలా..

  • తాజాగా 150 మంది ఉద్యోగులను తొలగించి 50 మందితోనే నెట్టుకొస్తున్నడంజో
  • బెంగళూరులో నలుగురు మిత్రులు కలిసి డంజో స్థాపన
  • తొలుత వాట్సాప్ గ్రూపు ద్వారా ఆర్డర్ల సేకరణ
  • లాభాలు రావడంతో యాప్‌ను తీసుకొచ్చిన సంస్థ
  • ముకేశ్ అంబానీ పెట్టుబడులతో ఓ వెలుగు వెలిగిన వైనం
  • గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1800 కోట్ల నష్టాలు
మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్‌లో ఓ గ్రూపుగా మొదలై ఆ తర్వాత రూ. 6,200 కోట్ల సంస్థగా ఎదిగిన నిత్యావసర వస్తువుల డెలివరీ సేవల సంస్థ డంజో ఇప్పుడు తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటోంది. ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్న సంస్థ ఉద్యోగులను భారీగా తొలగిస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బందిలో 150 మందిని తొలగించి ఇప్పుడు 50 మందితోనే పని కానిస్తోంది. 

వాట్సాప్ గ్రూప్ డంజోగా ఎలా మారింది?
కబీర్ బిశ్వాస్, అంకుర్ అగర్వాల్, దల్వీర్ సూరి, ముకుంద్ ఝా కలిసి బెంగళూరులో డంజోను స్థాపించారు. తొలుత ఈ సంస్థ వాట్సాప్ గ్రూపు ద్వారా వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకుని వస్తువులు సరఫరా చేసేది. అలా కొంచెం కొంచెంగా అభివృద్ధి సాధించిన డంజో ఆ తర్వాత యాప్‌ను తీసుకొచ్చి దేశంలోని ఇతర నగరాలకు విస్తరించింది.

ముకేశ్ అంబానీ పెట్టుబడులు
అనతికాలంలోనే అభివృద్ది దిశగా పయనిస్తున్న డంజోలో ముకేశ్ అంబానీ సంస్థ రిలయన్స్ రిటైల్ రూ. 1600 కోట్ల పెట్టుబడులు పెట్టింది. దీంతో డంజో విలువ అమాంతం రూ. 6,200 కోట్లకు పెరిగింది. అయితే, ఇటీవల ఈ సంస్థను ఆర్థిక కష్టాలు వేధించడం మొదలుపెట్టాయి. దీంతో ఏడాది కాలంగా ఉద్యోగుల వేతనాలు ఆలస్యమయ్యాయి. అంతేకాదు, గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 1800 కోట్ల నష్టాలు మూటగట్టుకుంది. 

నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు తాజాగా మరో 150 మంది ఉద్యోగులను తొలగించింది. వాట్సాప్ గ్రూపుగా మొదలై అతి తక్కువ సమయంలోనే దేశంలోని ప్రముఖ స్టార్టప్‌లలో ఒకటిగా పేరు సంపాదించుకున్న డంజో అంతే తక్కువ సమయంలో ఇలా కష్టాల సుడిగుండంలో చిక్కుకోవడం గమనార్హం.


More Telugu News