వరదలు అడ్డుకోవడంలో విఫలం.. 30 మందిని ఉరి తీయించిన కిమ్

  • ఇటీవల నార్త్ కొరియాను ముంచెత్తిన వరదలు
  • స్వయంగా పర్యటించి వివరాలు తెలుసుకున్న అధ్యక్షుడు
  • దేశవ్యాప్తంగా 4 వేల మంది మృత్యువాత
నార్త్ కొరియాను గత నెలలో వర్షాలు ముంచెత్తాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. సుమారు 4 వేల మంది చనిపోయారని, 5 వేల మందికి పైగా నిరాశ్రయులుగా మారారని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్.. వరదలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ 30 మంది ఉన్నతాధికారులను ఉరి తీయించారు. దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లడానికి కారణమయ్యారనే వారికి మరణ శిక్ష విధించినట్లు తాజాగా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. 

స్వయంగా పర్యటించిన అధ్యక్షుడు..
వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యటించారు. మోకాలు లోతు నీటిలో తన కారులో ప్రయాణించిన కిమ్.. వరదనీటిలో బోటుపై వెళ్లారు. వరదల తీవ్రతను, ప్రజలపై వాటి ప్రభావాన్ని స్వయంగా చూశారు. ఈ భారీ విపత్తు నుంచి కోలుకుని, తిరిగి నిర్మాణాలు చేపట్టడానికి రెండు మూడు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. ఇంతటి భారీ విపత్తుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ ఛాగాంగ్ ప్రావిన్స్ మాజీ కార్యదర్శి సహా మొత్తం 30 మంది ఉన్నతాధికారులకు కిమ్ మరణ శిక్ష విధించారని, గత నెలాఖరులోనే ఈ శిక్ష అమలు చేశారని నార్త్ కొరియా అధికారిక మీడియాను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి.



More Telugu News