ఆనంద్ మహీంద్రా విదేశీ కార్లు వాడుతున్నారా?.. క్లారిటీ ఇచ్చిన పారిశ్రామిక దిగ్గజం

  • తాను విదేశీ కార్లు వాడడం లేదని చెప్పిన  
  • మహీంద్రా స్కార్పియో-ఎన్ కారును వాడుతున్నట్టు వెల్లడించిన ఆనంద్ 
  • సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన దేశీయ పారిశ్రామిక దిగ్గజం
భారత పారిశ్రామిక దిగ్గజం, కార్ల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాకు పెద్ద సంఖ్యలో విదేశీ కార్లు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై ఆనంద్ మహీంద్రా క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ ఫేక్ ప్రచారాలని, కల్పిత కథనాలు అని ఖండించారు. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తయారు చేసిన వాహనాలు మాత్రమే తన వద్ద ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తాను స్కార్పియో-ఎన్‌ కారును ఉపయోగిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

‘‘ బ్లూ బర్డ్ అని మేము ముద్దుపేరు పెట్టుకున్న లేత ఆకాశ-నీలం రంగు ప్రీమియర్ కారులో మా అమ్మ నాకు డ్రైవింగ్ నేర్పించింది. 1991లో మహీంద్రా కంపెనీలో చేరిన నాటి నుంచి నేను మా కంపెనీ తయారు చేసిన వాహనాలను మాత్రమే నడుపుతున్నాను’’ అని వివరించారు. ప్రస్తుతం తాను మహీంద్రా కంపెనీ తయారు చేసిన ఎరుపు రంగు మహీంద్రా స్కార్పియో -ఎన్ కారును, అప్పుడప్పుడు తన భార్యకు చెందిన మహీంద్రా ఎక్స్‌యూవీ 700ని ఉపయోగిస్తుంటానని ఆయన చెప్పారు.

ఇక తాను ఓ విదేశీ కారు ముందు నిలుచుని ఉన్న వైరల్‌ ఫొటో.. ‘మోటోరి కార్‌ వీక్‌’లో మహీంద్రా కంపెనీకి చెందిన బాటిస్టా ఎలక్ట్రిక్ హైపర్‌కార్‌ విడుదల సందర్భంగా తీసిన ఫొటో అని చెప్పారు. ఫోటోలో కనిపిస్తున్న క్లాసిక్ సిసిటాలియా కారు డిజైన్‌ను మహీంద్రాకు చెందిన పినిన్‌ఫరీనా అనే కంపెనీ తయారు చేసిందని వివరించారు. 

ఇదీ వివాదం..
నిజానికి దేశీయ తయారీని ఆనంద్ మహీంద్రా ప్రోత్సహిస్తుంటారు. అయితే ఆయన వద్ద విదేశీ కార్లు ఉన్నాయని, మన దేశంలో తయారైన కార్లను వాడకుండా ఇక్కడ కార్లను ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ పోస్ట్ పెట్టడంతో ఈ వివాదం మొదలైంది. సొంత కంపెనీ తయారు చేస్తున్న మహీంద్రా థార్ కారు కాకుండా బీఎండబ్ల్యూ, బెంజ్ కార్లు ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించాడు. మహీంద్రా వద్ద ఉన్న విదేశీ కార్లలో ఫెరారీ కాలిఫోర్నియా టీ, పోర్షే 911, మెర్సిడెస్ బెంజ్-ఎస్ఎల్‌ఎస్ ఏజీఎం వంటి కార్లు ఉన్నాయని ఆరోపించాడు. ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి.


More Telugu News