'ప్రేమమ్' సినిమా హీరోపై లైంగిక వేధింపుల ఆరోపణలు... కేసు నమోదు

  • హీరో నివిన్‌పై ఓ నటి లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు 
  • నివిన్ సహా ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసుల నమోదు
  • నిందితుల్లో ఓ నిర్మాత కూడా..
  • లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించిన హీరో నివిన్
జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతం అయిన తర్వాత మలయాళ చిత్ర సీమలో తీవ్ర ప్రకంపనలు రేగుతున్న విషయం తెలిసిందే. ఫిలిమ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పలువురు హీరోయిన్లు బాధితుల్లో ఉండటం, వారు ఇప్పుడు తమకు ఎదురైన చేదు అనుభవాలను, వేధింపులను ధైర్యంగా వెల్లడిస్తుండటం హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే నటులు సిద్దిఖీ, జయసూర్య, దర్శకుడు రంజిత్ పై కేసులు నమోదు కాగా, తాజాగా హీరో నివిన్ పౌలీపై కేసు నమోదయింది. 

నివిన్ తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, గత నవంబర్ నెలలో దుబాయ్ తీసుకువెళ్లాడని, అక్కడ లైంగికంగా వేదించాడని ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రాధమిక విచారణ జరిపిన పోలీసులు నివిన్ పౌలీ సహా ఆరుగురిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుల్లో ఓ నిర్మాత కూడా ఉన్నారు. నివిన్‌పై కేసు నమోదు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో నివిన్ మలయాళ చిత్రాలతో పాటు ఇతర భాషల మువీల్లోనూ నటిస్తుండటంతో ఇతర రాష్ట్రాల ప్రేక్షకులకు సుపరిచితుడే. తెలుగు చిత్రం ప్రేమమ్ ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు నివిన్ దగ్గరయ్యాడు. 

కాగా, తనపై కేసు నమోదు కావడంపై నివిన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఓ అమ్మాయి పట్ల తాను అసభ్యంగా ప్రవర్తించాననేది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించేందుకు తాను ఎంత వరకైనా వెళ్తానని, న్యాయ పరంగా వీటిని ఎదుర్కుంటానని నివిన్ తెలియజేశారు.


More Telugu News