కేటీఆర్, హరీశ్ రావు క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయం చేయవద్దు: కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • జనాలు తిరగబడి చెప్పులతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరిక
  • ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తుందన్న ఎమ్మెల్యే
  • వర్షాలపై ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి లేఖ రాశారని వెల్లడి
తెలంగాణలో భారీ వర్షాలు, వరద ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం చేయవద్దని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కేటీఆర్, హరీశ్ రావు రాజకీయ లబ్ధి కోసం విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జనాలు తిరగబడి చెప్పులతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు.

ఆయన హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రజలకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు అహర్నిశలు పని చేస్తున్నారన్నారు. విపత్తుల్లో బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తూ, ఫొటోలకు పోజులు ఇవ్వడాన్ని తెలంగాణ సమాజం హర్షించదన్నారు. వర్షాలపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారని గుర్తుచేశారు. కేంద్రం పెద్దమనసుతో రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధాని మోదీ 11 ఏళ్లుగా భారతదేశ మూల సూత్రాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని విమర్శించారు. మోదీ నియంతృత్వ చర్యలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే విషయంపై లోతైన చర్చ జరిగిందన్నారు. ఆరు నెలలకు ఒకసారి రాష్ట్ర రాజకీయాలపై సమీక్ష జరపాలని రాహుల్ గాంధీ కృతనిశ్చయంతో ఉన్నారని వెల్లడించారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం దిశగా విప్లవాత్మక మార్పులు చేపట్టినట్లు తెలిపారు.


More Telugu News