ఖమ్మంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్... పువ్వాడ అజయ్ కారు ధ్వంసం

  • ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు
  • బొక్కలగడ్డలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ
  • ఇరువర్గాలను అదుపు చేసిన పోలీసులు
ఖమ్మంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వరద బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి నగరంలోని బొక్కలగడ్డకు వెళ్లారు. 

అదే సమయంలో అక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇరు పార్టీలకు చెందిన నేతలు అక్కడ ఉండటంతో.... పరస్పరం దాడి చేసుకునే స్థాయికి పరిస్థితి చేరుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు తమ తమ పార్టీలు, నేతలకు అనుకూలంగా పోటాపోటీ నినాదాలు చేశారు. రాళ్లు రువ్వుకున్నారు.

ఈ రాళ్ల దాడిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ కారు ధ్వంసమైంది. ఈ దాడిలో బీఆర్ఎస్ నాయకులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఒకరి కాలుకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఇరువర్గాలను అదుపు చేశారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్

మాజీ మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలకు సాయం చేయడం చేతగాక అండగా నిలుస్తామని హామీ ఇచ్చేందుకు వెళ్లిన నేతలను చూసి ఓర్వలేక దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం బాధితులను నిర్లక్ష్యం చేస్తే అండగా నిలవడమే మేం చేసిన తప్పా? అని ప్రశ్నించారు.

ప్రజలకు సేవ చేయకుండా... అండగా నిలిచేందుకు వెళ్లిన వారిపై దాడులు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దాడులు చేసి... తాము ప్రజల్లోకి వెళ్లకుండా ఆపలేరన్నారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి సరైన సమయంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.


More Telugu News