12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలే నిద్రపోతున్న వ్యక్తి.. ఎందుకో తెలుసా?

  • జీవితాన్ని రెట్టింపు చేసుకునేందుకు జపాన్ వ్యక్తి అసాధారణ అలవాటు
  • 30 నిమిషాల నిద్రతోనే శరీరం చురుగ్గా పనిచేసేలా ట్రైనింగ్ ఇచ్చిన డైసుకే హోరీ అనే వ్యక్తి
  • తన అలవాట్లను ఇతరులకు సైతం ట్రైనింగ్ ఇస్తున్న జపాన్ వ్యక్తి
మనిషి చక్కటి ఆరోగ్యంతో ఉండాలంటే రోజుకు సగటున  6-8 గంటలసేపు నిద్రపోవడం చాలా ముఖ్యం. తగిన నిద్ర లేకపోతే మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని, దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్థిరంగా 6-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యాన్ని పదిలపరుస్తుందని నిపుణులు సైతం నిర్ధారిస్తున్నారు.

అయితే జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి గత 12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. డైసుకే హోరి అనే వ్యక్తి తన జీవితాన్ని రెట్టింపు చేసుకునేందుకు రోజుకు అరగంట నిద్రను కొనసాగిస్తున్నాడు. పశ్చిమ జపాన్‌లోని హ్యోగోకు చెందిన 40 ఏళ్ల ఆ వ్యక్తి.. 30 నిమిషాలే నిద్రపోయినప్పటికీ తన శరీరం, మెదడును తక్కువ నిద్రతో సాధారణంగా పనిచేసేలా ట్రైనింగ్ ఇచ్చానని, ఈ విధంగా రోజూ ప్రాక్టీస్ చేయడంతో తన పని సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందని డైసుకే హోరి వెల్లడించాడు.

తినడానికి ఒక గంట ముందు వ్యాయామం లేదా కాఫీ తాగితే నిద్ర మత్తును దూరం చేసుకోవచ్చునని డైసుకే చెప్పినట్టు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ పేర్కొంది. మనిషి ఏకాగ్రతతో ఉండాలంటే ఎక్కువ సేపు నిద్రపోవడం కంటే నాణ్యమైన నిద్రపోవడం చాలా ముఖ్యమని డైసుకే చెప్పాడు. ‘‘పనిలో స్థిరమైన ఏకాగ్రత అవసరమయ్యే వ్యక్తులు ఎక్కువ సేపు నిద్రపోవడం కంటే నాణ్యత కలిగిన నిద్రతో ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు తీసుకుంటే వైద్యులు, అగ్నిమాపక సిబ్బంది తక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటుంటారు. కానీ అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు’’ అని డైసుకే చెప్పాడు.

డైసుకే హోరి చెప్పే విషయాలను మరింతగా తెలుసుకునేందుకు జపాన్‌కు చెందిన యోమియురి టీవీ ‘విల్ యు గో విత్ మీ’ అనే రియాలిటీ షో అతడిని 3 రోజుల పాటు అనుసరించింది. హోరీ కేవలం 26 నిమిషాలే నిద్రపోయి మంచి ఎనర్జీతో మేల్కొంటున్నాడని, అల్పాహారం చేసి పనిలో నిమగ్నం అవుతున్నాడని, జిమ్‌కి కూడా వెళ్లిన సందర్భాన్ని ఈ రియాలిటీ షో వెల్లడించింది. 

కాగా డైసుకే హోరీ తన ప్రత్యేకమైన నిద్ర అలవాటుతో 2016లో ‘జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసియేషన్‌’ను స్థాపించాడు. నిద్ర, ఆరోగ్యంపై అతడు పాఠాలు బోధిస్తున్నాడు. అల్ట్రా-షార్ట్ స్లీపర్‌లుగా మారేందుకు ఇప్పటివరకు 2,100 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చాడు. 

తక్కువ నిద్రకు సంబంధించి ఆసక్తికర విషయాలకు వస్తే.. వియత్నాం దేశానికి చెందిన థాయ్ ఎన్‌గోక్ అనే 80 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్లకు పైగా తాను నిద్రపోలేదని చెబుతున్నాడు. 1962లో జ్వరం వచ్చిన తర్వాత తాను నిద్రపోయే సామర్థ్యాన్ని కోల్పోయినట్టు అతడు చెబుతున్నాడు. చికిత్సలు తీసుకున్నా, నిద్ర మాత్రలు వాడినప్పటికీ నిద్రలేమి మారలేదని అతడు వివరించాడు.


More Telugu News