కెనడా మ‌రో కీల‌క నిర్ణ‌యం.. భారతీయ విద్యార్థులకు పెరగనున్న ఆర్థిక ఇబ్బందులు

  • క్యాంప‌స్ వెలుప‌ల వారానికి 24 గంట‌లకు మించి ప‌నిచేయ‌కూడ‌ద‌న్న కొత్త నిబంధ‌న‌
  • ఈ వారంలోనే అమల్లోకి రానున్న నిబంధ‌న‌
  • కెన‌డాలో ఉంటున్న ల‌క్ష‌లాది విదేశీ విద్యార్థుల‌పై ప్ర‌భావం 
కెన‌డాలోని జ‌స్టిన్ ట్రూడో ప్ర‌భుత్వం విదేశీ విద్యార్థుల ప‌ట్ల తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై విదేశీ విద్యార్థులు త‌మ జీవ‌నవ్యయం కోసం క్యాంప‌స్ వెలుప‌ల వారానికి 24 గంట‌లకు మించి ప‌నిచేయ‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌ను తీసుకువ‌చ్చింది. ఈ కొత్త నిబంధ‌న ఈ వారంలోనే అమ‌ల్లోకి రానుంది. 

ఈ నిబంధ‌న కార‌ణంగా ఆ దేశంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన లక్ష‌లాది మంది విదేశీ విద్యార్థులకు, ప్ర‌ధానంగా అధిక సంఖ్య‌లో ఉన్న‌ భారతీయ విద్యార్థులకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తలెత్తనున్నాయి. కాగా, గ‌తంలో కెనడాలో విదేశీ విద్యార్థులు వారానికి 20 గంటలు మాత్రమే క్యాంపస్‌ వెలుపల పనులు చేసుకునేందుకు వీలుండేది. 

అయితే, క‌రోనా సంక్షోభ సమయంలో ఆ దేశంలో కార్మికుల కొరత ఏర్పడటంతో ఈ నిబంధనను తాత్కాలికంగా ఎత్తి వేశారు. ఈ వెసులుబాటు గడువు ఈ ఏడాది ఏప్రిల్‌ 30తో ముగియడంతో ఇప్పుడు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు.

అయితే, అంతర్జాతీయ విద్యార్థుల కోసం కెనడాలో వేసవి లేదా శీతాకాలం సెల‌వుల స‌మ‌యంలో పని గంటలపై ఎటువంటి పరిమితులు ఉండవు. 

ఇదిలాఉంటే.. 2022లో కెనడాలోని 5.5 లక్షల మంది విదేశీ విద్యార్థులలో 2.26 లక్షల మంది ఇండియ‌న్ స్టూడెంట్స్ ఉండ‌డం గ‌మ‌నార్హం. సుమారు 3.2 లక్షల మంది భారతీయులు స్టూడెంట్ వీసాలపై కెనడాలో ఉంటూ గిగ్ వర్కర్లుగా ఆ దేశ‌ ఆర్థిక వ్యవస్థకు సహకరించడం జ‌రిగింది. 

ఇక క్యాంపస్ వెలుపల ఉద్యోగాల ద్వారా వ‌చ్చే ఆదాయం భారతీయ విద్యార్థులకు వారి భోజన, వసతి ఖ‌ర్చుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. కాగా, అక్క‌డ చాలా స్టాండర్డ్ వర్క్ షిఫ్టులు 8 గంటల నిడివితోనే ఉంటాయి. దాంతో ఇప్పుడు తీసుకువ‌చ్చిన కొత్త నిబంధ‌న‌ ప్రకారం విద్యార్థులు వారానికి మూడు పార్ట్-టైమ్ షిఫ్టుల వరకు మాత్రమే పని చేయగలరు. దీని వలన వారు తమ అద‌న‌పు ఖర్చులను భరించడం కష్టమవుతుంద‌ని విద్యార్థులు వాపోతున్నారు. 

ఇక‌ ఇప్పటికే కెన‌డా స‌ర్కార్‌ వలస విధానాలను మార్చడంతో పాటు స్టడీ పర్మిట్లపై పరిమితి విధించిన విష‌యం తెలిసిందే. అటు శాశ్వత నివాస దరఖాస్తుల సంఖ్యను కుదించాలని నిర్ణయించింది. దీంతో ఎంతో మంది విదేశీ విద్యార్థులను కష్టాల్లోకి నెట్టింది. ఇప్పుడు క్యాంప‌స్ వెలుప‌ల జాబ్స్‌పై ప‌రిమితి విధించ‌డంతో వారి క‌ష్టాలు రెట్టింపు అయ్యాయి.


More Telugu News