బీజేపీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • బీజేపీ ఎన్నికల యంత్రం కాదన్న మోదీ
  • ఎన్నికల్లో గెలుపు కార్యకర్తల కృషికి ఉప ఉత్పత్తి అని వ్యాఖ్య
  • ఎంతోమంది కార్యకర్తల జీవితాలు పార్టీకి పెట్టుబడి అంటూ ప్రశంసలు
భారతీయ జనతా పార్టీ ఎన్నికల యంత్రం కాదని, ఎన్నికల్లో గెలుపు పార్టీ కార్యకర్తల కృషికి ఉప ఉత్పత్తి మాత్రమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీకి ఎన్నికల యంత్రం అనే పదాన్ని ఆపాదించారని, పార్టీకి అంతకుమించిన అవమానం ఇంకొకటి లేదని ఆయన అన్నారు. ‘‘ మన పార్టీ కేవలం ఎన్నికల యంత్రం మాత్రమే కాదు. తోటి పౌరుల కలలను సాకారం చేసే పార్టీ మనది. జాతి కలలను తీర్మానాలుగా, ఆ తీర్మానాలను సాకారంగా మార్చే క్రమంలో మనల్ని మనం పూర్తిగా ఈ ప్రక్రియకే అంకితం చేసుకుంటున్నాం’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు ‘సంఘటన పర్వ, సదస్యత అభియాన్ 2024'లను ప్రారంభించారు. ఈ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. కాగా ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు ప్రముఖ నేతలు కూడా పాల్గొన్నారు.

అనేక మంది కార్యకర్తల జీవితాలు పెట్టుబడి
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. అనేక తరాల కార్యకర్తలు తమ జీవితాలను ఈ పార్టీకి పెట్టుబడిగా పెట్టారని, నేడు పార్టీ ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుందని ప్రధాని మోదీ అన్నారు. ''సదస్యత అభియాన్' కార్యక్రమం మరోదఫా  ప్రారంభమైంది. దేశంలో ఒక కొత్త రాజకీయ సంస్కృతి తీసుకురావడానికి భారతీయ జనసంఘ్ నుంచి మేము అన్ని ప్రయత్నాలు చేశాం. ప్రజలు అధికారం కట్టబెట్టే సంస్థ లేదా రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య విలువలను పాటించకుంటే, అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే... ఈవేళ ఇతర రాజకీయ పార్టీలు ఎదుర్కుంటున్న పరిస్థితే మనకూ వస్తుంది’’ అని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.


More Telugu News