ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్ట్

  • జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనతో మార్మోగిన ఆర్జీ కర్ ఆసుపత్రి పేరు
  • ప్రిన్సిపాల్ ఉద్యోగం నుంచి సస్పెన్షన్ కు గురైన సందీప్ ఘోష్
  • హత్యాచార కేసు, ఆర్థిక అవకతవకల కేసుల్లో ఘోష్ ను ప్రశ్నించిన సీబీఐ
  • ఏకంగా 16 రోజులు ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేసిన వైనం
ఏకంగా 16 రోజుల పాటు  ప్రశ్నించిన అనంతరం, కోల్ కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను సీబీఐ నేడు అరెస్ట్ చేసింది. గత నెల 9వ తేదీన ఆర్జీ కర్ మెడికల్ కాలేజి ఆసుపత్రి సెమినార్ హాల్లో ఓ మహిళా జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీరును అరెస్ట్ చేశారు. 

అయితే, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వైఖరి అనుమానాస్పదంగా ఉండడంతో, సీబీఐ ఈ కేసు చేపట్టినప్పటి నుంచి ఆయనను ప్రశ్నిస్తోంది. పలుమార్లు ఆయన నివాసంలో సోదాలు కూడా నిర్వహించింది. 

జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలోనూ, ఆర్జీ కర్ వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకల విషయంలోనూ... రెండు కేసుల్లోనూ సీబీఐ సమాంతర దర్యాప్తు చేస్తోంది. ఈ రెండు కేసుల్లోనూ సందీప్ ఘోష్ ను సీబీఐ లోతుగా ప్రశ్నించింది. 

అయితే ఆయనను ఇవాళ అరెస్ట్ చేసింది ఏ కేసులో అన్నది స్పష్టంగా తెలియరాలేదు. ఆర్థిక అక్రమాల కేసులోనే ఆయనను అరెస్ట్ చేశారని తెలుస్తోంది.


More Telugu News