ప్రకాశం బ్యారేజి వద్ద దెబ్బతిన్న గేట్లను పరిశీలించిన కన్నయ్య నాయుడు

  • ప్రకాశం బ్యారేజి వద్ద వరద ఉద్ధృతి
  • వరదకు కొట్టుకొచ్చిన బోట్లు
  • బోట్లు బలంగా ఢీకొట్టడంతో దెబ్బతిన్న బ్యారేజి గేట్లు 
  • మంత్రి నిమ్మలతో కలిసి బ్యారేజి వద్దకు వచ్చిన కన్నయ్యనాయుడు
  • గేట్లకు ఉండే కౌంటర్ వెయిట్ దెబ్బతిన్నదని వెల్లడి 
విజయవాడలో ప్రకాశం బ్యారేజి వద్ద గేట్లు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. వరద నీటికి కొట్టుకొచ్చిన బోట్లు... బ్యారేజి గేట్లను బలంగా ఢీకొట్టడంతో రెండు గేట్లు దెబ్బతిన్నాయి. 

ఈ నేపథ్యంలో, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్, ప్రాజెక్టు గేట్ల నిపుణుడు, రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్యనాయుడు ప్రకాశం బ్యారేజి వద్దకు వచ్చారు. దెబ్బతిన్న 67, 69 నెంబరు గేట్లను కన్నయ్యనాయుడు పరిశీలించారు. 

ఇటీవల తుంగభద్ర డ్యామ్ గేటును సరిచేయడంలోనూ కన్నయ్యనాయుడు కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజి వద్ద దెబ్బతిన్న గేట్లను సరిచేసేందుకు కన్నయ్యనాయుడు ప్రణాళిక రూపొందించారు. 

రేపు వరద ఉద్ధృతి తగ్గాక పనులు మొదలు పెడతామని కన్నయ్యనాయుడు మీడియాకు తెలిపారు. తమ టీమ్ అంతా సిద్ధంగా ఉందని వెల్లడించారు. 

తుంగభద్ర డ్యామ్ వద్ద స్టాప్ లాగ్ వేసి గేటును సరిదిద్దామని, ఇక్కడ ప్రకాశం బ్యారేజి వద్ద భగవంతుడి దయవల్ల కౌంటర్ వెయిట్ మాత్రమే దెబ్బతిన్నదని వివరించారు. దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ తొలగించి, చెయిన్ ను లాక్ చేసుకుని, గేట్లను మెల్లగా దించుతామని కన్నయ్యనాయుడు వివరించారు.


More Telugu News