మారుతి సుజుకి ఆల్టో కే 10, ఎస్‌-ప్రెసో ధరల తగ్గింపు

  • గత నెలలో 3.9 శాతం పడిపోయిన మారుతి కార్ల అమ్మకాలు
  • ఆల్టో కే10 ధరను రూ. 6,500, ఎస్-ప్రెసో మోడల్ ధరను రూ. 2 వేలు తగ్గించిన మారుతి
  • గతేడాదితో పోలిస్తే ఈసారి 20 శాతం క్షీణించిన మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్ వాహన అమ్మకాలు
ఆగస్టు నెలలో కార్ల విక్రయాలు పడిపోవడంతో అప్రమత్తమైన మారుతి సుజుకి ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్టో కే10, ఎస్-ప్రెసో కార్ల ధరలను తగ్గించింది. మారుతి సుజుకి ఎస్-ప్రెసో ఎల్ఎక్స్ఐ పెట్రోలు వేరియంట్ ధరను రూ. 2 వేలు, ఆల్టో కే10 వీఎక్స్ఐ పెట్రోలు వేరియంట్ ధరను రూ. 6,500 తగ్గించింది. ఆగస్టులో మారుతి కార్ల విక్రయాలు 3.9 శాతం క్షీణించి 1,81,782 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే నెలలో 1,89,082 కార్లు అమ్ముడయ్యాయి. 

గత నెలలో మారుతి సుజుకి దేశీయంగా 1,45,570 కార్లు విక్రయించగా, 26,003 కార్లను ఎగుమతి చేసింది. నిరుడు ఇదే సమయంలో మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్‌లో 84,660 యూనిట్లు విక్రయించగా, ఈసారి ఆ సంఖ్య 68,699 యూనిట్లకు పడిపోయింది. బాలెనో, సెలరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ మోడళ్లు గతేడాది 72,451 యూనిట్లు అమ్ముడుపోగా ఈసారి 20 శాతం క్షీణించి 58,051 యూనిట్లకు పడిపోయాయి.


More Telugu News