సచిన్ రికార్డు బద్దలు కొట్టడంపై ప్రశ్న.. జో రూట్ సమాధానం ఇదే!

  • టెస్టు క్రికెట్‌లో దూసుకెళ్తున్న ఇంగ్లండ్ స్టార్ ఆట‌గాడు జో రూట్‌
  • అద్భుత‌మైన ఫామ్‌తో సెంచ‌రీ మీద సెంచ‌రీ బాదుతున్న ఇంగ్లిష్ బ్యాట‌ర్‌
  • ఇప్ప‌టికే టెస్టుల్లో 34 శ‌త‌కాల సాయంతో 12,377 ప‌రుగులు 
  • సచిన్ అత్య‌ధిక టెస్టు ర‌న్స్ (15,921) రికార్డుకు కేవ‌లం 3,544 పరుగుల దూరంలో రూట్‌
  • తాను జ‌ట్టు కోసం ప‌రుగులు చేయ‌డం గురించే ఆలోచిస్తాన‌న్న స్టార్ క్రికెటర్‌
ఇంగ్లండ్ స్టార్ ఆట‌గాడు జో రూట్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. లార్డ్స్ వేదిక‌గా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల‌లోనూ శ‌త‌కాలు బాదాడు. దీంతో అత‌ని టెస్డు కెరీర్‌లో 34 సెంచ‌రీలు పూర్తి చేసుకున్నాడు. అంతేగాక ఇంగ్లండ్ త‌ర‌ఫున టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగుల రికార్డును కూడా తన పేరున లిఖించుకున్నాడీ 33 ఏళ్ల ప్లేయ‌ర్‌.

ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ ఆడే విధానంలో గణనీయమైన మార్పు క‌నిపిస్తోంది. బ్రెండన్ మెకల్లమ్ ఆ జ‌ట్టు హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత నుంచి స‌రికొత్త పధ్ధతితో క్రికెట్ ఆడుతోంది ఇంగ్లీష్ జ‌ట్టు. బాజ్‌బాల్ పేరిట దూకుడైన ఆట‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై ఎదురు దాడి చేసి ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేయ‌డం చేస్తోంది. ఇదే శైలితో ఆ జ‌ట్టు చాలా విజ‌యాలు కూడా సాధించింది. కానీ, రూట్ మాత్రం త‌న‌దైన శైలిలోనే బ్యాటింగ్ చేస్తూ, సెంచ‌రీల మీద సెంచ‌రీలు న‌మోదు చేస్తున్నాడు. 

ఈ క్ర‌మంలో ఎన్నో రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు 12, 377 ప‌రుగుల‌తో టెస్ట్ క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్ల జాబితాలో టాప్‌-07 స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఈ జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్ 15,921 ర‌న్స్‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. రూట్ మ‌రో 3544 ప‌రుగులు చేస్తే, స‌చిన్‌ను దాటి టాప్‌లో నిలుస్తాడు. దీంతో ఈ ఇంగ్లండ్ బ్యాట‌ర్ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ రికార్డును అధిగ‌మించే అవ‌కాశం ఉంద‌ని క్రీడా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అత‌నికి 33 ఏళ్ల వ‌య‌సు మాత్ర‌మే ఉండ‌డం, మంచి ఫిట్‌నెస్‌తో క‌నిపిస్తుండ‌డంతో లిటిల్ మాస్ట‌ర్ రికార్డును అందుకోవ‌డం రూట్‌కు పెద్ద స‌మ‌స్య కాక‌పోవ‌చ్చ‌నేది వారి అభిప్రాయం.  

ఇదే విష‌యంపై తాజాగా జో రూట్‌కు ఒక ప్ర‌శ్న ఎదురైంది. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో మీరు స‌చిన్‌ ఆల్ టైమ్ టాప్ స్కోరింగ్ రికార్డును అధిగ‌మించే అవ‌కాశం ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని అడిగారు. దీనికి ఈ ఇంగ్లండ్ స్టార్ త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చాడు. తాను తన జట్టు కోసం ఆడటం, పరుగులు చేయడం మాత్రమే ఆలోచిస్తాన‌ని చెప్పాడు. అంతకు మించి తాను ఏమీ ఆలోచించను అని తెలిపాడు.

"నేను నా జ‌ట్టు త‌ర‌పున ఆడి, నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. నేను చేయగలిగినన్ని ఎక్కువ పరుగులు సాధించి జ‌ట్టుకు ఉప‌యోగ‌ప‌డాల‌ని అనుకుంటాను. మ‌నం చేసే ప‌రుగుల కార‌ణంగా జ‌ట్టు గెలిస్తే అంతకంటే మంచి అనుభూతి లేదు. టెస్ట్ మ్యాచ్ గెల‌వ‌డం కంటే ఇంకా గొప్ప అనుభూతి లేదు అనేది నా అభిప్రాయం. 

అలాంటి సంద‌ర్భాల్లో మ‌న ఆట వ‌ల్ల జ‌ట్టుకు ప్ర‌యోజ‌నం చేకూరితే అంత‌కంటే గొప్ప విష‌యం మ‌రోక‌టి లేదు. నా దృష్టి ఎప్పుడూ అలాంటి విష‌యాల‌పైనే ఉంటుంది. మ‌న ఆట‌నే మ‌న‌ల్ని జ‌ట్టులో నిల‌బెడుతుంది. అది లేక‌పోతే ఎంత గొప్ప ప్లేయ‌ర్ అయినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు" అని రూట్ ఇంగ్లండ్ క్రికెట్ షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.


More Telugu News