అర్ధరాత్రి రిస్క్ చేసిన చంద్రబాబు.. అయినా అధికారుల్లో అదే నిర్లక్ష్యం

  • వరదల్లో చిక్కుకున్న వారికి అందని ఆహారం
  • ఏపీ సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా స్పందించని వైనం
  • తీవ్రంగా మండిపడుతున్న బాధితులు
అర్ధరాత్రి పూట వరద నీటిలో ప్రయాణం.. భద్రతా సిబ్బంది వద్దంటున్నా, రిస్క్ అని తెలిసినా వెరవకుండా ఏపీ సీఎం చంద్రబాబు వరద బాధితులను పరామర్శించారు. రిస్క్ తీసుకుని బోటులో ప్రయాణిస్తూ బాధితుల దగ్గరికి వెళ్లారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, భయాందోళనలు అక్కర్లేదని భరోసా కల్పించారు. వరదలో చిక్కుకున్న వారికి ఎప్పటికప్పుడు ఆహారం అందించడంతో పాటు ఇతరత్రా సాయం చేయాలని స్పష్టంగా ఆదేశాలిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.

అయినా కొంతమంది అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడలేదు. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి గాజులపేటలో వరదలో చిక్కుకుని తిండి, నీళ్లు లేక బాధితులు అలమటిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి వారికి ఎలాంటి ఆహారం అందలేదని, అధికారులు ఎవరూ కూడా అటువైపు తొంగిచూడలేదని సమాచారం. ఇదే ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఆదివారం అర్ధరాత్రి పర్యటించారు. బాధితుల కష్టాలను స్వయంగా చూశారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు.

సీఎం ఆదేశాలతో సోమవారం ఉదయం ఉరుకులు పరుగులు పెట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక బాధితులైతే తీవ్రంగా మండిపడుతున్నారు. తిండి, నీరు అందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు వాకిలి వరదలో మునగడంతో నిరాశ్రయులుగా మారిన పలువురు హైవేలపైనే ఉంటున్నారు. తినడానికి తిండి సంగతి అటుంచి కనీసం కాలకృత్యాలు తీర్చుకునే సదుపాయం కూడా లేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.


More Telugu News