హేమ కమిటీ రిపోర్టుపై రజనీకాంత్ ఏమన్నారంటే..!

హేమ కమిటీ రిపోర్టుపై రజనీకాంత్ ఏమన్నారంటే..!
  • మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపిన నివేదిక
  • పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలపై ఆరోపణలు
  • ఆ రిపోర్టు గురించి తనకు తెలియదన్న సూపర్ స్టార్
మలయాళ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపులకు కారణమైన జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. ఆ కమిటీ గురించి కానీ, అది ఇచ్చిన నివేదిక గురించి కానీ తనకేమీ తెలియదని జవాబిచ్చారు. ఆదివారం తనను పలకరించిన మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ క్రమంలోనే జస్టిస్ హేమీ కమిటీ రిపోర్టుపై మీరెలా స్పందిస్తారంటూ ఓ విలేకరి అడగగా.. రజనీకాంత్ కాస్త కన్ఫూజన్ కు లోనయ్యారు. ప్రశ్న అర్థంకాలేదని, మరోసారి అడగాలని కోరారు. దీంతో సదరు విలేకరి మరోసారి హేమ కమిటీ రిపోర్టును ప్రస్తావించగా.. ఆ కమిటీ ఏం రిపోర్టు ఇచ్చిందో, మలయాళ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తనకేమీ తెలియదని రజనీకాంత్ జవాబిచ్చారు. కాగా, మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, లింగ వివక్ష, పారితోషికంలో వ్యత్యాసాలు, కనీస సౌకర్యాల కొరత.. తదితర అంశాలపై జస్టిస్ హేమ కమిటీ ఓ రిపోర్టు తయారు చేసి కేరళ సర్కారుకు ఇటీవల అందజేసింది.

ఈ నివేదిక బయట పెట్టడంతో చాలామంది మహిళా యాక్టర్లు తాము ఎదుర్కొన్న వేధింపులను బయటపెట్టారు. నటుడు జయసూర్యతో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. పలువురు నటీమణులు ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ప్యానెల్ సభ్యులపైనా ఆరోపణలు చేశారు. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ 'అమ్మ' ప్రెసిడెంట్ మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు ప్యానెల్ లోని 17 మంది సభ్యులు కూడా రాజీనామా చేశారు. దీనిపై మోహన్ లాల్ స్పందిస్తూ.. అమ్మ ప్రెసిడెంట్ గా తాను రెండుసార్లు బాధ్యతలు నిర్వహించానని గుర్తుచేశారు. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుకు కేవలం ‘అమ్మ’ మాత్రమే కాదు మలయాళం ఇండస్ట్రీ మొత్తం జవాబు చెప్పాలన్నారు. వేధింపులకు పాల్పడ్డ వారికి శిక్ష పడాలని తేల్చిచెప్పారు.


More Telugu News