పాకిస్థాన్‌తో రెండో టెస్టులో రికార్డు.. ధోనీ సరసన బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్

  • రావల్పిండిలో పాక్‌తో రెండో టెస్టులో తలపడుతున్న బంగ్లాదేశ్
  • తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన వేళ లిటన్ దాస్ అద్భుత పోరాటం
  • మెహిదీ హసన్‌తో కలిసి ఏడో వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యం
  • పాకిస్థాన్‌పై ఆ దేశ గడ్డ మీద సెంచరీ చేసిన ఆరో విదేశీ వికెట్ కీపర్‌గా లిటన్ దాస్ అరుదైన రికార్డు
పాకిస్థాన్‌తో రావల్పిండిలో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ సాధించిన బంగ్లాదేశ్ స్టార్ వికెట్ కీపర్ లిటన్ దాస్ అరుదైన రికార్డు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ను 274 పరుగులకు ఆలౌట్ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. 26 పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన లిటన్ దాస్ అద్భుతమైన ఆటతీరుతో జట్టును పోటీలో నిలిపాడు. మెహిదీ హసన్‌తో కలిసి ఏడో వికెట్‌కు ఏకంగా 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 228 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 138 పరుగులు సాధించిన లిటన్ దాస్‌కు టెస్టుల్లో ఇది నాలుగో సెంచరీ. మెహిదీ హసన్ మిరాజ్ 124 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో 78 పరుగులు చేశాడు. వీరిద్దరి అసమాన ఆటతీరుతో బంగ్లాదేశ్ 262 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

ఈ సెంచరీతో లిటన్ దాస్ అరుదైన రికార్డు అందుకున్నాడు. పాకిస్థాన్‌పై పాక్ గడ్డ మీద టెస్టు సెంచరీ సాధించిన ఆరో విదేశీ వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో అతడికంటే ముందు కుమార సంగక్కర, ఎంఎస్ ధోనీ, రొమేశ్ కలువితరణ తదితరులు ఉన్నారు. 

పాక్‌ గడ్డపై టెస్టు సెంచరీ సాధించింది వీరే 
న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ వారెన్ లీస్ 1976లో కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన టెస్టులో 152 పరుగులు చేశాడు. శ్రీలంక కీపర్ రొమేశ్ కలువితరణ పాక్‌తో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ (100) సాధించాడు. అదే దేశానికి చెందిన కుమార సంగక్కర అదే స్టేడియంలో రెండుసార్లు సెంచరీలు నమోదు చేశాడు. 2002లో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ (230) సాధించగా, 2009లో 104 పరుగులు చేశాడు. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనీ ఫైసలాబాద్‌లోని ఇక్బాల్ స్టేడియంలో 2006లో జరిగిన మ్యాచ్‌లో  148 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ ఆటగాడు ఒల్లీ పోప్ రావల్పిండిలోని పిండీ క్రికెట్ స్టేడియంలో 2022లో జరిగిన టెస్టులో 108 పరుగులు చేయగా, ఇప్పుడు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ అదే స్టేడియంలో 138 పరుగులు చేశాడు.


More Telugu News