రేవంత్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఇప్పటికైనా అర్థమైందా?: నాగబాబు

  • హైదరాబాదులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం
  • రేవంత్ రెడ్డి నిర్ణయం సాహసోపేతమన్న నాగబాబు
  • ఆయన చర్యలను అందరూ అభినందించాలంటూ ట్వీట్
హైదరాబాదులో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ 'హైడ్రా' కదం తొక్కుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సినీ నటుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందించారు. 

వర్షాలు పడి తూములు తెగిపోయి, చెరువులు, నాలాలు ఉప్పొంగి అపార్ట్ మెంట్ లలోకి కూడా నీళ్లు రావడం, కొన్ని సామాన్య ప్రాణాలు కూడా బలికావడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. అందుకు ముఖ్య కారణం చెరువులను, నాలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేయడమేనని నాగబాబు స్పష్టం చేశారు. 

"తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్ ఇప్పటికైనా అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని, నిబద్ధతతో కూడిన చర్యలను మనమందరం అభినందిద్దాం. రేవంత్ రెడ్డి గారూ... మా సంపూర్ణ సహకారం మీకే" అంటూ నాగబాబు సోషల్ మీడియాలో స్పందించారు.


More Telugu News