కోదాడలో వరదలకు కొట్టుకొచ్చిన కార్లు... వాటిలో మృతదేహం... వీడియో ఇదిగో!

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోరం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొర్లుతుండగా.. వరద నీటిలో రెండు కార్లు కొట్టుకొచ్చాయి. ఓ కారులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కోదాడలోని వైష్ణవి స్కూల్ ఏరియాలో ఈ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 

అక్కడికి సమీపంలోని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా... అందులో రెండు కార్లు, ఆటోలు కొట్టుకుపోయాయి. కాగా, వరదకు కొట్టుకొచ్చిన కారులో చనిపోయింది రవి అనే వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు, శనివారం రాత్రి బైక్ పై ఇంటికి వెళుతున్న శ్రీనివాసనగర్‌కు చెందిన టీచర్‌ వెంకటేశ్వర్లు వరదలో గల్లంతయ్యాడు. ఆదివారం ఉదయం శ్రీమన్నారాయణ కాలనీలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 

కుండపోత వర్షం కారణంగా కోదాడ పెద్ద చెరువు మత్తడి దూకుతోంది... నగరంలోని పలు కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. నయానగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. 

వరద కారణంగా అనంతగిరి, మేళ్లచెరువు రహదారులపై రాకపోకలను అధికారులు నిలిపేశారు. వరద నీటి కారణంగా హైదరాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.




More Telugu News