1500 ఐఫోన్లు చోరీ.. ఎలా దొంగిలించారంటే?

  • మధ్యప్రదేశ్‌లో రూ.11 కోట్ల విలువైన ఫోన్లు చోరీ
  • ఆగస్టు 15న గురుగ్రామ్ నుంచి చెన్నైకి వెళ్తున్న కంటెయినర్ నుంచి దొంగతనం
  • డ్రైవర్ ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం
  • ముగ్గురు పోలీసు అధికారులపై చర్యలు
ఏకంగా రూ.11 కోట్ల విలువైన సుమారు 1,500 ఐఫోన్లు చోరీకి గురయ్యాయి. ఆగస్టు 15న హర్యానాలోని గురుగ్రామ్ నుంచి చెన్నైకి వెళ్తున్న కంటెయినర్ నుంచి ఈ ఫోన్లను దొంగతనం చేశారు. కంటెయినర్ మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లా గుండా వెళ్తున్న సమయంలో ఈ దోపిడీ జరిగింది. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో చోరీ జరిగింది. కంటెయినర్ డ్రైవర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగలు తనకు మత్తుమందు ఇచ్చారని, నోటికి ప్లాస్టర్ వేసి ఈ చోరీకి పాల్పడ్డారని పేర్కొన్నాడు. అయితే డ్రైవర్ స్టేట్‌మెంట్‌ ఆధారంగా కేసు నమోదు చేయడంలో పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహించారు.

ముగ్గురు పోలీసులు నిర్లక్ష్యం వహించారని తేలడంతో మధ్యప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులు శనివారం చర్యలు తీసుకున్నారు. ఒక అధికారిని సస్పెండ్ చేయగా.. మిగతా ఇద్దరిని నాన్-ఫీల్డ్ డ్యూటీలకు అటాచ్ చేశారు.

ఐఫోన్ల చోరీ ఘటనపై నర్సింగ్‌పూర్ జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ సంజయ్ స్పందించారు. సాగర్ జోన్ ఐజీ ప్రమోద్ వర్మ పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారని, బండారి స్టేషన్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌లపై చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. ఈ కేసును పరిష్కరించడంలో కానిస్టేబుల్ రాజేశ్ పాండే అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతడిని సస్పెండ్ చేసినట్టు వివరించారు. యాపిల్ ఫోన్ల దొంగతనంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.


More Telugu News