ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన విండీస్ స్టార్ క్రికెటర్

  • సీపీఎల్ 2024 తర్వాత రిటైర్ అవుతున్నట్టు వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో ప్రకటన
  • కరేబియన్ ప్రజల ముందు చివరిగా ఆడతానన్న క్రికెట్ దిగ్గజం
  • 2021లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆల్ టైమ్ గ్రేట్
2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ డ్వేన్ బ్రావో ప్రొఫెషనల్ క్రికెట్‌‌కు కూడా గుడ్‌బై చెప్పాలి. కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024 ముగిసిన తర్వాత రిటైర్ కాబోతున్నట్టు శనివారం తన నిర్ణయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. దీంతో ఆల్ టైమ్ అత్యుత్తమ డెత్-ఓవర్ బౌలర్లలో ఒకడైన బ్రావో ఇకపై లీగ్‌లలో కూడా కనిపించడు.

తన 'ఫైనల్ ప్రొఫెషనల్ టోర్నమెంట్' సీపీఎల్ 2024 అని, కరేబియన్ ప్రజల ముందు ఈ టోర్నీ ఆడతానని బ్రావో తెలిపాడు. 40 ఏళ్ల బ్రావో 2021లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. వెస్టిండీస్ జట్టు 2012, 2016లలో రెండు టీ20 ప్రపంచ కప్ టైటిల్స్‌ను గెలుచుకున్న తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘‘ గొప్ప క్రికెట్ ప్రయాణం చేశాను. నా కరేబియన్ ప్రజల ముందు నా చివరి ప్రొఫెషనల్ టోర్నమెంట్ ఆడేందుకు ఎదురు చూస్తున్నాను. ‘ట్రిన్‌బాగో నైట్ రైడర్స్’ జట్టుతో నా ప్రయాణం ముగుస్తుంది’’ అని భావోద్వేగంగా పేర్కొన్నాడు.

కాగా టీ20 క్రికెట్ చరిత్రలో బ్రావోకు అదిరిపోయే రికార్డులు ఉన్నాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లు, లీగ్‌లు సహా మొత్తం 578 టీ20 మ్యాచ్‌లు ఆడిన అతడు ఏకంగా 630 వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్ చరిత్రలో బౌలింగ్ గణాంకాల్లో బ్రావో అగ్రస్థానంలో నిలిచాడు. 2006లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఆల్ రౌండర్‌గా రాణిస్తున్నాడు. పెద్ద సంఖ్యలో వికెట్లే కాదు, టీ20 క్రికెట్‌లో అతడు 6,970 పరుగులు కూడా బాదాడు.

సీపీఎల్ 2024లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ జట్టుకు బ్రావో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ జట్టుకు ఇప్పటివరకు 94 మ్యాచ్‌లు ఆడిన బ్రావో 128 వికెట్లు తీశాడు. సీపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అతడు నిలిచాడు. ఐపీఎల్‌లో కూడా బ్రావో తన సత్తా చాటాడు. మొత్తం 58 మ్యాచ్‌లు ఆడి 183 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా నిలిచాడు. ఈ ఆల్-రౌండర్ ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.




More Telugu News