కేసీఆర్‌పై ఉత్తమ్ కుమార్ రెడ్డి 'డెకాయిట్' వ్యాఖ్య... తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు

  • కేసీఆర్‌పై వ్యాఖ్య మంత్రి దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని మండిపాటు
  • బూతులు తిట్టడంలో రేవంత్ రెడ్డికి తక్కువ కాదని నిరూపించుకుంటున్నారా? అని ఎద్దేవా
  • పేరేమో ఉత్తమ్... మాట తీరేమో మూసి ప్రవాహమని వ్యాఖ్య
మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డెకాయిట్ అని సంబోధించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ వ్యాఖ్యలు మంత్రి దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. 

బూతులు తిట్టడంలో తాను సీఎం రేవంత్ రెడ్డికి ఏమీ తక్కువ కాదని మంత్రి నిరూపించుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. పేరేమో ఉత్తమ్... మాట తీరేమో మూసీ ప్రవాహమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నోటితో పాటే ఉత్తమ్ నోటిని ప్రక్షాళణ చేయాల్సిందే అన్నారు.

అసలు తెలంగాణను డెకాయిట్ చేసింది ఎవరు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. వేలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నదెవరు? మీరు కాదా? ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.17 వేల కోట్ల నుంచి తట్టమట్టి ఎత్తకుండానే రూ.40 వేల కోట్లకు పెంచుకున్న సంగతి మరిచిపోయారా? అని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. మీ కాంగ్రెస్ డెకాయిట్ గురించి ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పానని... ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తున్నానన్నారు.

నాడు తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే టెండర్లను ఖరారు చేసి అడ్వాన్స్ రూపంలో దండుకోలేదా? అని ప్రశ్నించారు. 2010లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డీపీఆర్‌ను రూ.40,300 కోట్లకు సవరించి పంపించింది ఉత్తమ్ మంత్రిగా ఉన్నప్పుడేనని విమర్శించారు.


More Telugu News