భారత అండర్-19 జట్టులోకి రాహుల్ ద్రవిడ్ కుమారుడు

  • స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో మ‌ల్టీ ఫార్మాట్‌ సిరీస్ ఆడ‌నున్న భారత అండర్-19 జట్టు
  • సెప్టెంబర్ 21, 23, 26 తేదీల్లో పుదుచ్చేరిలో మూడు 50 ఓవర్ల మ్యాచ్‌లు
  • సెప్టెంబరు 30, అక్టోబర్ 7న చెన్నైలో రెండు 4 రోజుల మ్యాచ్‌లు 
  • ఈ రెండు ఫార్మాట్‌ల‌కు ఎంపికైన స‌మిత్ ద్ర‌విడ్
టీమిండియా మాజీ కోచ్‌, కెప్టెన్‌ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్ర‌విడ్ స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో జ‌రిగే మ‌ల్టీ ఫార్మాట్‌ సిరీస్ కోసం తొలిసారి భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

ఇక ఈ మ‌ల్టీ సిరీస్‌లో భాగంగా భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టు సెప్టెంబర్ 21, 23, 26 తేదీల్లో పుదుచ్చేరిలో జరిగే మూడు 50 ఓవర్ల మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా అండ‌ర్‌-19 జ‌ట్టుతో తలపడుతుంది. ఆ తర్వాత సెప్టెంబరు 30 మరియు అక్టోబర్ 7న చెన్నైలో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడుతుంది.

యూపీకి చెందిన‌ మహమ్మద్ అమన్‌ 50 ఓవర్ల జట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అలాగే మధ్యప్రదేశ్‌కు చెందిన సోహమ్ పట్వర్ధన్ నాలుగు రోజుల మ్యాచ్‌లకు జట్టుకు నాయకత్వం వహిస్తాడు.

ఇదిలాఉంటే.. స‌మిత్‌ ద్రవిడ్ ఇటీవలే తన మొదటి సీనియర్ పురుషుల టీ20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. కర్ణాటకలో జరుగుతున్న‌ మహారాజా టీ20 ట్రోఫీలో మైసూరు వారియర్స్ జట్టుకు ప్రాత‌నిధ్యం వ‌హిస్తున్నాడు. ఈ టోర్నీలో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్న ద్రవిడ్ ఇప్ప‌టివ‌ర‌కు ఏడు ఇన్నింగ్స్‌లలో 114 స్ట్రైక్ రేటుతో 82 పరుగులు చేశాడు. స‌మిత్ మీడియం పేస్‌ బౌలింగ్ కూడా చేయ‌గ‌ల‌డు. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు అతని బౌలింగ్ వేసే అవ‌కాశం రాలేదు. శనివారం టోర్నీ సెమీఫైనల్‌లో హుబ్లీ టైగర్స్‌తో మైసూరు వారియర్స్ తలపడనుంది.

వన్డే సిరీస్ కోసం భారత అండ‌ర్‌-19 జట్టు: రుద్ర పటేల్ (వైస్ కెప్టెన్‌), సాహిల్ పరాఖ్, కార్తికేయ, మహ్మద్ అమన్ (కెప్టెన్‌), కిరణ్ చోర్మలే, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీప‌ర్‌), హర్వాన్ష్ సింగ్ పంగాలియా (వికెట్ కీప‌ర్‌), సమిత్ ద్రవిడ్, యుధాజిత్ గుహా, సమర్థ్ , నిఖిల్ కుమార్, చేతన్ శర్మ , హార్దిక్ రాజ్, రోహిత్ రజావత్, మొహమ్మద్ ఈనాన్.

నాలుగు రోజుల సిరీస్ కోసం భారత అండ‌ర్‌-19 జట్టు: వైభవ్ సూర్యవంశీ, నిత్య పాండ్యా, విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్‌), సోహమ్ పట్వర్ధన్ (కెప్టెన్‌), కార్తికేయ, సమిత్ ద్రవిడ్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీప‌ర్‌), హర్వాన్ష్ సింగ్ పంగాలియా (వికెట్ కీప‌ర్‌), చేతన్ శర్మ, సమర్థ్, ఆదిత్య రావత్, నిఖిల్ కుమార్, అన్మోల్జీత్ సింగ్, ఆదిత్య సింగ్, మొహమ్మద్ ఈనాన్.


More Telugu News