హైదరాబాద్‌లో వాలిన ‘ఆకాశ తిమింగలం’.. వీడియో ఇదిగో!

  • ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటిగా ఎయిర్ బెలూగాకు గుర్తింపు
  • మస్కట్ నుంచి థాయిలాండ్ వెళ్తూ ఇంధనం కోసం హైదరాబాద్‌లో ల్యాండింగ్
  • గతంలో రెండుసార్లు హైదరాబాద్‌కు
ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ‘ఎయిర్‌బస్ బెలూగా’ నిన్న హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ‘వేల్ ఆఫ్ ద స్కై’ (ఆకాశ తిమింగలం) అని పిలిచే ఈ ఎయిర్‌బస్ ఎ300-608ఎస్‌టీ విమానం శుక్రవారం తెల్లవారుజామున 12.23 గంటలకు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. అంతకుముందు ఇది మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. థాయిలాండ్ వెళ్తూ ఇంధనం నింపుకునేందుకు ఇక్కడ ఆగింది. అనంతరం నిన్న మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి థాయిలాండ్ బయలుదేరింది.

ఈ ఆకాశ తిమింగలం ప్రయాణం ఈ నెల 27న ఫ్రాన్స్‌లోని టౌలౌస్ విమానాశ్రయం నుంచి మొదలైంది. ఆ తర్వాత అదే దేశంలోని మార్సెయిల్‌లో ల్యాండ్ అయింది. 28న ఈజిప్ట్ రాజధాని కైరో చేరుకుంది. 29న కైరోలో టేకాఫ్ తీసుకుని ఒమన్‌లోని మస్కట్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి థాయిలాండ్ వెళ్తూ హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది. 

ఎయిర్‌బస్ బెలూగా హైదరాబాద్‌కు రావడం ఇది మూడోసారి. డిసెంబర్ 2022, ఆగస్ట్ 2023లో రెండుసార్లు శంషాబాద్‌లో ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని 1995లో తొలిసారి పరిచయం చేశారు. సాధారణ కార్గో విమానాలు మోయలేనంత సరుకును ఇది ఇట్టే ఎగరేసుకుపోతుంది.


More Telugu News