అన్ స్టాప‌బుల్ హీరో మా బాల మామ‌య్య: నారా లోకేశ్‌

  • శుక్రవారంతో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ సినీ ప్రస్థానం 
  • ఈ సంద‌ర్భంగా బాల‌య్యకు ప‌లువురు ప్ర‌ముఖుల అభినందనలు 
  • 'ఎక్స్' వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి నారా లోకేశ్
టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానం శుక్రవారంతో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయనకు సినీ రంగంతో పాటు, వివిధ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన అల్లుడు, మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా శుభాకాంక్ష‌లు చెప్పారు. ‘బాల‌ మామ‌య్యా.. స‌రిలేరు నీకెవ్వ‌ర‌య్యా!’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

"యాభై ఏళ్లుగా వెండితెర‌పై తిరుగులేని క‌థానాయ‌కుడిగా వెలుగుతూ ఉన్న మా బాల మామ‌య్య‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ‘తాతమ్మకల’తో 1974వ సంవ‌త్స‌రంలో తెరంగేట్రం చేసిన మామ‌య్య వేయ‌ని పాత్ర లేదు.. చేయ‌ని ప్ర‌యోగం లేదు. ఐదు ద‌శాబ్దాల‌లో హీరోగా 109 సినిమాల‌లో న‌టించి అవార్డులు-రివార్డులు అందుకుని రికార్డు సృష్టించారు. 

ప్ర‌యోజ‌నాత్మ‌క‌, ప్ర‌యోగాత్మ‌క సినిమాల‌తో గాడ్ ఆఫ్ మాసెస్ గా బాల మామ‌య్య పేరుగాంచారు. సాంఘిక‌, పౌరాణిక‌, వినోద ప్ర‌ధాన‌మైన చిత్రాల‌లో హీరోగా న‌టించి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. అగ్ర‌హీరోగా వెలుగొందుతూనే రాజ‌కీయాల్లో రాణిస్తూ, సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల మ‌న‌స్సులు గెలుచుకున్న అన్ స్టాప‌బుల్ హీరో మా బాల మామ‌య్య" అని లోకేశ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.


More Telugu News