రోహిత్ శర్మ తదుపరి ఐపీఎల్ సీజన్‌పై స్పిన్నర్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ముంబై ఇండియన్స్‌కే ఆడాలన్న దిగ్గజ స్పిన్నర్
  • కెప్టెన్సీ లేకపోయినా ముంబైకి ఆనందంగా ఆడగలనంటూ భావించాలని సూచన
  • ఒక దశకు వచ్చాక కొంతమందికి డబ్బు పెద్ద విషయం కాబోదని విశ్లేషించిన అశ్విన్
గత సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ పాండ్యాను యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం ఆ జట్టుకు అంతగా కలిసి రాలేదు. పైగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. క్రికెట్ విశ్లేషకులు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీంతో రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నాడని, వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడబోడని, వేరే ఏదైనా జట్టుకు ఆడే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

స్టార్ బ్యాటర్, ఓపెనర్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వీడకూడదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ -2025 సీజన్‌లో ముంబైకే ఆడాలని సూచించాడు. ఈ విషయంలో రోహిత్ శర్మ స్థానంలో ఉండి ఆలోచించినా తప్పేమీ అనిపించడం లేదని అన్నాడు. ‘‘నాకు ఎలాంటి ఇబ్బందులు అక్కర్లేదు. భారత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాను. ముంబై ఇండియన్స్‌కి ఎన్నోసార్లు నాయకత్వం వహించాను. కెప్టెన్ కాకపోయినా ముంబై జట్టుకి సంతోషంగా ఆడతాను. ముంబైకి ఆడడం చాలా బాగుంటుంది’’ అని రోహిత్ శర్మ అనుకోవాలని అశ్విన్ సూచించాడు. అత్యధిక ప్లేయర్లు ఇదే విధంగా ఆలోచిస్తారని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నాడు. కొంతమంది ఆటగాళ్లు ఒక దశకు వచ్చిన తర్వాత వారికి డబ్బు పెద్ద విషయం కాదని అశ్విన్ వ్యాఖ్యానించాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ అశ్విన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

కాగా ఐపీఎల్ 2024 సీజన్‌లో రోహిత్ శర్మ అశించిన స్థాయిలో రాణించలేదు. 32.07 సగటు, 150 స్ట్రైక్ రేట్‌తో 417 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. బెస్ట్ స్కోరు 105(నాటౌట్)గా ఉంది. మొత్తంగా చూసుకుంటే 2011లో ముంబై ఇండియన్స్ జట్టు చేరిన రోహిత్ శర్మ.. ఈ ఫ్రాంచైజీ తరపున 199 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 29.39 సగటు, 129.86 స్ట్రైక్ రేట్‌తో 5,084 పరుగులు సాధించాడు.


More Telugu News