లడ్డూల విక్రయంపై అసత్య ప్రచారాలను నమ్మొద్దు: టీటీడీ
- కొన్ని ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయన్న టీటీడీ అడిషనల్ ఈవో
- దళారుల దందాను అరికట్టేందుకు చిన్న మార్పులు చేశామని వెల్లడి
- భక్తులకు మేలు చేసేలా టీటీడీ నిర్ణయాలు ఉంటాయని వ్యాఖ్య
తిరుమల శ్రీవారి లడ్డూల విక్రయాలపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని భక్తులను కోరారు. లడ్డూ విక్రయాల విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు. బ్లాక్ మార్కెట్, దళారుల దందాను అరికట్టేందుకే చిన్న మార్పులు చేశామని తెలిపారు. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు ఆధార్ నెంబర్ నమోదుతో రెండు లడ్డూలను విక్రయిస్తామని చెప్పారు. దర్శనం టికెట్, టోకెన్ టికెట్ కలిగిన భక్తులకు ఉచిత లడ్డూతో పాటు నాలుగు నుంచి ఆరు లడ్డూలను విక్రయిస్తామని తెలిపారు. భక్తులకు మేలు చేసే విధంగా టీటీడీ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.