అమరావతి పనులు స్టార్ట్ అవుతున్నాయ్... ఇంకా 3,558 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేయాలి

  • అమరావతి రైతులకు రూ. 175 కోట్లను గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిందన్న నారాయణ
  • సెప్టెంబర్ 15లోగా చెల్లిస్తామని వెల్లడి
  • విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులను రెండు దశల్లో చేపడతామన్న మంత్రి
అమరావతి రైతులకు గత వైసీపీ ప్రభుత్వం రూ. 175 కోట్లను పెండింగ్ లో ఉంచిదని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ మొత్తాన్ని సెప్టెంబర్ 15లోగా చెల్లిస్తామని చెప్పారు. ఈ ఏడాదిలో ఇవ్వాల్సిన రూ. 225 కోట్లను కూడా వీలైనంత త్వరలో చెల్లిస్తామని తెలిపారు. అమరావతి నిర్మాణంపై ఐఐటీ చెన్నై, ఐఐటీ హైదరాబాద్ ల నుంచి సెప్టెంబర్ మొదటి వారంలో నివేదికలు వస్తాయని చెప్పారు. 2025 నాటికి అమరావతిలో అన్ని పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయని తెలిపారు. హైటెక్ నగరంగా అమరావతిని నిర్మిస్తామని చెప్పారు. 

విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులు ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నాయని నారాయణ తెలిపారు. ఈ రెండు మెట్రో రైల్ ప్రాజెక్టులను రెండు దశల్లో చేపట్టాలని భావిస్తున్నామని చెప్పారు. అమరావతిలో రూ. 160 కోట్లతో సీఆర్డీయే ప్రధాన కార్యాలయ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యాలయంలోనే అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్, సీఆర్డీయే, మున్సిపల్ శాఖ, టిడ్కో తదితర కార్యాలయాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో ఇంకా 3,558 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేయాల్సి ఉందని తెలిపారు.


More Telugu News