రుణమాఫీపై రేవంత్ ప్రభుత్వం స్పష్టతనివ్వాలి: సీపీఎం నేత రంగారెడ్డి

  • ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్
  • షరతులు, ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ చేయాలన్న సీపీఎం నేత
  • రుణమాఫీ 40 శాతం కూడా పూర్తి కాలేదన్న జూలకంటి రంగారెడ్డి
రుణమాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలని, ప్రతి రైతుకూ తప్పనిసరిగా రుణమాఫీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలన్నారు.

మొదట ప్రతి రైతుకూ రూ.2 లక్షల రుణమాఫీ అని చెప్పి... ఆ తర్వాత రైతు కుటుంబానికి మాత్రమేనని మాట మార్చిందని విమర్శించారు. అది కూడా అందరికీ మాఫీ చేయడం లేదన్నారు. ఇప్పటివరకూ రూ.22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లకు పైగా జమ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఎన్నికల సమయంలో ఏక కాలంలో రూ.2 లక్షలు మాఫీ చేస్తామని ప్రకటించారని పేర్కొన్నారు.

రుణమాఫీ 40 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. రైతులు బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రుణమాఫీ చేయాలన్నారు. గత ప్రభుత్వంలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తే తగిన సమయంలో రైతులు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


More Telugu News