ప్రముఖ మలయాళ సినీ న‌టుడిపై రేప్ కేసు.. హేమ కమిటీ నివేదిక తర్వాత మరో కేసు నమోదు!

  • మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై హేమ కమిటీ నివేదిక‌ 
  • ఈ రిపోర్ట్ వ‌ల్ల‌ ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణల నేప‌థ్యంలో 17 కేసుల న‌మోదు
  • తాజాగా ప్రముఖ న‌టుడు, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎమ్ ముకేశ్‌పై రేప్ కేసు 
  • నటులు జయసూర్య, మణియం పిళ్ల రాజుపై కూడా కేసుల నమోదు
మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్‌ హేమ కమిటీ రూపొందించిన నివేదిక ద్వారా పలు దిగ్భ్రాంతికర విష‌యాలు బయటకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దాంతో ఈ నివేదిక‌పై ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా చర్చ జ‌రుగుతోంది. కాగా, క‌మిటీ రిపోర్టు స‌మ‌ర్పించిన త‌ర్వాత బాధితులు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి తాము గ‌తంలో ఎదుర్కొన్న వేధింపులను బ‌య‌ట‌పెడుతున్నారు. 

ఇక ఈ రిపోర్ట్ కార‌ణంగా ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణల నేప‌థ్యంలో 17 కేసుల వరకు నమోదయ్యాయని స‌మాచారం. తాజాగా మరో కొత్త‌ కేసు నమోదైంది.

ప్రముఖ న‌టుడు, కేర‌ళ‌లోని అధికార పార్టీ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎమ్ ముకేశ్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. కొన్నేళ్ల క్రితం తనను ముకేశ్ లైంగిక వేధించాడంటూ ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసినట్లు అధికారులు వెల్ల‌డించారు.

కొచి నగరంలోని మారడు పీఎస్‌లో ఐపీసీ 376(రేప్) సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. కాగా, హేమ కమిటీ నివేదిక వ‌చ్చిన‌ తర్వాత మలయాళ చిత్ర ప‌రిశ్ర‌మలో నమోదైన మూడో హై ప్రొఫైల్ కేసు ఇదే. అంత‌కుముందు నటులు జయసూర్య, మణియం పిళ్ల రాజుపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసిన విష‌యం తెలిసిందే.


More Telugu News