ఏపీ సీఎం చంద్రబాబుతో బీజేపీ నేతల కీలక భేటీ

  • ఏపీ సీఎం చంద్రబాబుతో బీజేపీ నేతలు శివప్రకాశ్, దగ్గుబాటి పురందేశ్వరి సమావేశం
  • నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యతపైనే ప్రధానంగా చర్చ 
  • ముందుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నివాసంలో సమావేశమైన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండున్నర నెలలు దాటింది. ఇక నామినేటెడ్ పదవులపై తెలుగు తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కీలక నామినేటెడ్ పదవులు దక్కుతాయన్న ఆశతో ఉన్నారు. అయితే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యంగా ఉన్న జనసేన, బీజేపీ నేతలు కూడా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. దీంతో నామినేటెడ్ పదవుల నియామకాలలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ తరుణంలో బీజేపీ కీలక నేతలు మంగళవారం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
సీఎం చంద్రబాబుతో బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు కూటమిలో నెలకొన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. అలానే నామినేటెడ్ పదవుల్లోనూ బీజేపీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు సమాచారం. చంద్రబాబుతో భేటీకి ముందు విజయవాడలోని పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. 

కేంద్ర మంత్రి  భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎంపీ సీఎం రమేశ్, రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ యాదవ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు, విప్ ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ పార్థసారథి, ఎన్ ఈశ్వరరావు, రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ తదితరులు పురందరేశ్వరి నివాసంలో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవులు, జిల్లాల వారీగా ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది.


More Telugu News