టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కకపోవడంపై రోహిత్ చెప్పిన విషయాన్ని వెల్లడించిన రింకూ సింగ్

  • ఇంకా చాలా టోర్నమెంట్‌లు ఉంటాయంటూ రోహిత్ ప్రోత్సహించాడని చెప్పిన రింకూ
  • చిన్న వయసే కావడంతో ఇంకా అవకాశాలు ఉంటాయని చెప్పాడని వెల్లడి
  • ఆటపై శ్రద్ధ పెట్టాలంటూ సూచన చేశాడన్న యంగ్ క్రికెటర్
టీమిండియా తరపున స్థిరంగా పరుగులు రాబట్టి, చెప్పుకోదగ్గ సగటు, మంచి స్ట్రైక్-రేట్‌ ఉన్నప్పటికీ యంగ్ క్రికెటర్ రింకూ సింగ్‌కు టీ20 వరల్డ్ కప్ 2024 జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడినప్పటికీ సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. జట్టులో నలుగురు స్పిన్ బౌలర్ల కోసం రింకూ సింగ్‌ని విస్మరించాల్సి వచ్చింది. అయితే రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేసిన సెలక్టర్లు అతడిని జట్టుతో పాటు ఉంచారు. కాగా జట్టు ప్రకటన రోజు నిరాశకు గురైన రింకూ సింగ్ వద్దకు వెళ్లి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ఆ సందర్భంలో రోహిత్ ఇచ్చిన సందేశాన్ని రింకూ సింగ్ తాజాగా వెల్లడించాడు.

రోహిత్ శర్మ తన దగ్గరకు వచ్చి మాట్లాడాడని, తాను చిన్నవాడినే కావడంతో ఇంకా చాలా టోర్నమెంట్‌లు ఉంటాయని ప్రోత్సహించినట్టు రింకూ చెప్పాడు. ప్రతి రెండేళ్లకోసారి ప్రపంచకప్ ఉంటుంది కాబట్టి నిరాశ చెందొద్దని, ఆటపై దృష్టి పెట్టాలంటూ రోహిత్ సూచించాడని వివరించాడు. ‘న్యూస్24’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఇక విరాట్ కోహ్లీ అంటే తనకు చాలా ఇష్టమని, జట్టును నడిపించే సమయంలో అతడి దూకుడు స్వభావం బాగుంటుందని రింకూ సింగ్ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కూడా బాగుంటుందని అన్నాడు. ఇదిలావుంచితే.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తనను రిటెయిన్ చేసుకోకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలని భావిస్తున్నట్టు రింకూ సింగ్ ఇటీవలే తన మనసులో మాట చెప్పిన విషయం తెలిసిందే.

కాగా రింకూ సింగ్ టీమిండియా తరపున 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. సగటు సుమారు 60 పరుగులు, స్ట్రైక్ రేట్‌ 174గా ఉన్నాయి. మరో విశేషం ఏంటంటే, రింకూ సింగ్ 17 మ్యాచ్‌లు ఆడగా 10 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా చివరి వరకు క్రీజులో నిలిచాడు. రింకూ సింగ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ ఆడుతున్నాడు. మీరట్ మావెరిక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక సెప్టెంబర్‌లో జరగనున్న దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన నాలుగు టీమ్‌ల్లో ఒక జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కింది.


More Telugu News