దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష... అర్చకులకు శుభవార్త!

  • రూ.10 వేలు అందుకునే అర్చకులకు ఇకపై రూ.15 వేల వేతనం
  • ధూప దీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ.10 వేలకు పెంపు
  • నాయీ బ్రాహ్మణులకు కనీసం వేతనం రూ.25 వేలు చేయాలని నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులకు శుభవార్త చెప్పారు. ఇప్పటిదాకా రూ.10 వేలు వేతనంగా అందుకుంటున్న అర్చకులకు ఇకపై రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అదే సమయంలో ధూప దీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నారు. 

ఆలయ విధుల్లోని నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25 వేలకు పెంచాలని నిర్ణయించారు. నిరుద్యోగ వేద విద్యార్థులకు  రూ.3 వేల భృతి ఇవ్వాలన్న నిర్ణయానికి కూడా చంద్రబాబు ఆమోదం తెలిపారు. 

దాంతోపాటే... ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, భక్తుల మనోభావాలను గౌరవించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆలయాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని, ప్రసాదంలో నాణ్యత ఉండేలా చూడాలని, ఆలయాల్లో ఆధ్యాత్మిక  భావనలు పెంపొందించేలా ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

ఆలయాల్లో అపచారాలకు తావులేని విధంగా వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


More Telugu News