సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రెండో విడత ప్రజాపాలన: రేవంత్ రెడ్డి

  • రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను జారీ చేసేందుకు అవసరమైన వివరాల కోసం ప్రజాపాలన
  • క్షేత్రస్థాయిలో సిబ్బందిని సన్నద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
  • తొలి విడత ప్రజాపాలనలో 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడి
సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. 

రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డుల జారీ కోసం అవసరమైన వివరాలను సేకరించేందుకు సెప్టెంబర్ నెలలో పది రోజుల పాటు రెండో విడత ప్రజాపాలన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు తొలి విడత నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారెంటీల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. 

గోషామహల్‌లో నిర్మించబోయే కొత్త ఉస్మానియా ఆసుపత్రిపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రి నిర్మాణం చేయాలన్నారు. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ల అనుసంధానానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.


More Telugu News