కవితకు బెయిల్‌పై వ్యాఖ్య... బండి సంజయ్‌పై వినోద్ కుమార్ ఆగ్రహం

  • బండి సంజయ్ అనాలోచితంగా వ్యాఖ్యలు చేశారన్న బీఆర్ఎస్ నేత
  • బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన వినోద్ కుమార్
  • మోదీకి బీఆర్ఎస్ లొంగిపోయుంటే కవితకు ఎప్పుడో బెయిల్ వచ్చి ఉండేదన్న వినోద్ కుమార్
కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ మండిపడ్డారు. ఆయన అనాలోచితంగా ఈ వ్యాఖ్యలు చేశారని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆలస్యమైనప్పటికీ కవితకు బెయిల్ ఇవ్వడం సంతోషకరమైన విషయమన్నారు. మద్యం పాలసీ కేసులో బీజేపీ వ్యతిరేక పార్టీలకు సంబంధించిన నేతలపై ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. రాజకీయంగా బీజేపీని విభేదించే నేతలు కాకపోయి ఉంటే ఈ కేసులో 15 రోజుల్లోనే బెయిల్ వచ్చి ఉండేదన్నారు.

మోదీ ప్రభుత్వం చాలామందిపై ఇలాంటి అక్రమ కేసులు పెట్టి లొంగతీసుకుంటోందని ఆరోపించారు. బీఆర్ఎస్ లొంగిపోయి ఉంటే కవితకు ఎప్పుడో బెయిల్ వచ్చి ఉండేదన్నారు. తాము కోర్టులో కొట్లాడి... చట్టపరంగా బెయిల్ తెచ్చుకున్నామన్నారు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టడానికే కవితను ఇరికించారని ఆరోపించారు.

కవిత ఎండలు మండిపోయే వేసవిలో జైలు జీవితం అనుభవించారని వాపోయారు. మద్యం పాలసీ కేసులో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రికవరీ కాలేదని సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు. ఛార్జిషీట్ వేశాక ఇంకా జైల్లో ఎందుకు పెట్టారని సుప్రీంకోర్టు ప్రశ్నించిందన్నారు. దానికి విచారణ సంస్థ నుంచి సమాధానం రాలేదన్నారు.


More Telugu News