ఏపీ హోంమంత్రి అనితను కలిసిన సుగాలి ప్రీతి తల్లి

  • 2017లో కర్నూలులోని ఓ స్కూల్లో విద్యార్థిని సుగాలి ప్రీతి మృతి
  • ఉరేసుకుని చనిపోయిందన్న పాఠశాల యాజమాన్యం
  • రేప్ చేసి చంపేశారన్న సుగాలి ప్రీతి తల్లిదండ్రులు
  • ఇప్పటికీ అపరిష్కృతంగా కేసు
ఏడేళ్ల కిందట కర్నూలులోని ఓ ప్రైవేటు స్కూల్లో సుగాలి ప్రీతి అనే విద్యార్థిని ఫ్యాన్ కు ఉరేసుకున్న స్థితిలో విగతజీవురాలిగా దర్శనమిచ్చింది. సుగాలి ప్రీతి ఉరేసుకుని చనిపోయిందని స్కూల్ యాజమాన్యం పేర్కొనగా... స్కూల్ కరస్పాండెంట్ కుమారులు అత్యాచారం చేసి చంపేశారని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ కేసు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సుగాలి ప్రీతి వ్యవహారంపై పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో, సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి నేడు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏపీ హోంమంత్రి అనితను కలిశారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయం పట్ల వివరించారు. 

అనంతరం మీడియాతో  మాట్లాడుతూ... న్యాయం కోసం ఏడేళ్లుగా తిరుగుతున్నామని ఆమె ఆక్రోశించారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీతో న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని అన్నారు. 

సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని పార్వతీదేవి వెల్లడించారు. సీబీఐ విచారణ ప్రారంభం కాకపోవడంతో ఢిల్లీ కూడా వెళ్లామని తెలిపారు. ఆ జీవో టిష్యూ పేపర్ తో సమానమని అధికారులు చెప్పడం తమను మరింత కుంగిపోయేలా చేసిందని వాపోయారు. గత ప్రభుత్వం ఫేక్ జీవోలతో తమను మోసం చేసిందని అన్నారు. సీఎస్ గా పనిచేసిన జవహర్ రెడ్డి కూడా తమకు అన్యాయం చేశారని పార్వతీదేవి వ్యాఖ్యానించారు. 

తాజాగా, ఈ కేసును సీఐడీకి అప్పగిస్తామని హోంమంత్రి అనిత చెప్పారని, ఈ కేసును సీఐడీ చీఫ్ రవిశంకర్ స్వయంగా విచారిస్తారని హామీ ఇచ్చారని వివరించారు.


More Telugu News