హైద‌రాబాద్‌లో ఫ్లైఓవ‌ర్లు, కనెక్టింగ్ రోడ్ల‌పై కేటీఆర్ ట్వీట్‌.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

  • కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ ఎస్ఆర్‌డీపీ ప‌నులు నెమ్మ‌దించాయ‌న్న కేటీఆర్‌
  • ఎస్ఆర్‌డీపీ కింద కేసీఆర్ ప్ర‌భుత్వం 42 కొత్త ప్రాజెక్టుల‌ను ప్రారంభించిందని వెల్ల‌డి
  • గ‌త‌ 8 నెల‌లుగా ఎస్ఆర్‌డీపీ ప‌నుల‌పై స‌ర్కార్ ప‌ర్య‌వేక్ష‌ణ క‌రవైంద‌ని విమ‌ర్శ‌
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. హైద‌రాబాద్‌లో ఫ్లైఓవ‌ర్లు, కనెక్టింగ్ రోడ్ల‌పై ట్వీట్ చేసిన‌ కేటీఆర్.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టిన త‌ర్వాత ఎస్ఆర్‌డీపీ (స్ట్రాట‌జిక్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రామ్‌) ప‌నులు నెమ్మ‌దించాయ‌ని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ హ‌యాంలోనే హైదరాబాద్‌లో మౌలిక స‌దుపాయాలను క‌ల్పించ‌డానికి ఎస్ఆర్‌డీపీ ద్వారా చొర‌వ తీసుకున్నా‌మ‌న్నారు. దీని కింద అప్ప‌టి కేసీఆర్ ప్ర‌భుత్వం 42 కొత్త ప్రాజెక్టుల‌ను ప్రారంభించింద‌ని గుర్తు చేశారు. అందులో 36 ప్రాజెక్టులు విజ‌య‌వంతంగా పూర్తయ్యాయ‌ని, మిగిలిన వాటిని 2024లో పూర్తి చేయాల్సి ఉండేన‌ని తెలిపారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పాల‌న‌లో ఎస్ఆర్‌డీపీ ప‌నులు పూర్తిగా నెమ్మ‌దించాయన్నారు. 

గ‌డిచిన 8 నెల‌లుగా స‌ర్కార్ త‌రుఫున స‌రైన ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోవ‌డంతో కాంట్రాక్ట‌ర్ల‌కు స‌కాలంలో చెల్లింపులు జ‌ర‌గ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ఎస్ఆర్‌డీపీ ఫేజ్‌-3 ప‌నుల‌ను తిరిగి ప్రారంభించాల‌ని కేటీఆర్ కోరారు. ఈ ఫేజ్-3 ప‌నుల్లో మూసీ వెంబ‌డి ఎక్స్‌ప్రెస్‌వే, కేబీఆర్ పార్క్ కింద ట‌న్నెల్స్ నిర్మాణం, ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్‌పాస్‌లు, ఇత‌ర అనేక గ్రేడ్‌సెప‌రేటర్లు ఉన్నాయ‌న్నారు.


More Telugu News