స్వీడన్‌ను భారీగా వీడుతున్న భార‌తీయులు.. కార‌ణం ఏంటంటే..!

  • ఈ ఏడాది మొద‌టి 6 నెల‌ల్లోనే 2,837 మంది భారతీయులు స్వీడన్‌కు గుడ్ బై  
  • గ‌తేడాది ఇదే కాలవ్య‌వ‌ధితో పోలిస్తే ఇది 171 శాతం అధికం
  • ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన‌ ‘స్టాటిస్టిక్స్‌ స్వీడన్‌’ నివేదిక 
  • భార‌తీయులు స్వీడన్‌ను విడిచిపెట్టడానికి ప్ర‌ధాన కార‌ణం పెరిగిన‌ జీవన వ్యయం
ఐరోపాలో భారతీయులను అమితంగా ఆకర్షించే దేశం స్వీడన్‌. అయితే, ఇటీవ‌ల ఈ దేశంపై మ‌నోళ్ల‌కు మ‌క్కువ త‌గ్గుతోంది. ఆ దేశానికి భారీగా భార‌తీయులు బైబై చెబుతున్నారు. ఈ విష‌యాన్ని ‘స్టాటిస్టిక్స్‌ స్వీడన్‌’ నివేదిక గ‌ణాంకాలు వెల్ల‌డించాయి. 

ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వ‌ర‌కు స్వీడన్‌కు వచ్చిన భారతీయుల కంటే ఆ దేశాన్ని వీడిన వారే అధిక సంఖ్య‌లో ఉన్న‌ట్లు ఈ రిపోర్ట్ పేర్కొంది. ఈ ఆరు నెలల కాలవ్య‌వ‌ధిలో 2,837 మంది ప్ర‌వాస భారతీయులు స్వీడన్‌ను విడిచిపెట్టారు. 2023లో ఇదే 6 నెలల కాలంతో పోలిస్తే ఇది ఏకంగా 171 శాతం అధికంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

భార‌తీయులు స్వీడన్‌కు బైబై చెప్ప‌డానికి కార‌ణం ఏంటంటే..!
భారతీయులు భారీ మొత్తంలో స్వీడన్‌ను విడిచిపెట్టడానికి ప్ర‌ధాన కార‌ణం భారీగా జీవన వ్యయం పెర‌గ‌డ‌మే. అందుబాటు ధరల్లో నివాసాలు లభించకపోవడం లాంటివే ప్రధాన కారణాలు అని తెలుస్తోంది. అలాగే ఇటీవల స్వీడన్‌కు చెందిన పలు బ‌డా కంపెనీలు భారీగా ఉద్యోగుల‌ను తొల‌గించడం మ‌రో కార‌ణం. 

అలా స్వీడన్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారు ఆ తర్వాత కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం కష్టంగా మారడంతో కొందరు ఆ దేశాన్ని వీడుతున్నట్టు స‌మాచారం. పైగా ఇటీవ‌ల స్వీడ‌న్ స‌ర్కార్ విదేశీయుల‌కు ఇచ్చే వర్క్‌ పర్మిట్ల విషయంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. 

వ‌ర్క్ ప‌ర్మిట్ల‌కు అక్క‌డి ప్ర‌భుత్వం క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తుండ‌డంతో విదేశీయుల‌ జీవిత భాగస్వాములకు జాబ్స్ దొరకడం కష్టంగా మారింది. దీంతో చాలామంది స్వీడన్‌కు గుడ్ బై చెబుతున్నారు. వీరిలో భార‌తీయులే అధికంగా ఉన్న‌ట్లు నివేదిక వెల్ల‌డించింది.


More Telugu News