హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం

  • పెద్దల అక్రమ కూల్చివేతలు ఫర్వాలేదు కానీ పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదంటున్న బీజేపీ
  • అక్రమ కట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • పేదలకు ప్రత్యామ్నాయం చూపాలన్న బీజేపీ
చెరువులు, నాలాల్లోని ఆక్రమణల కూల్చివేతలపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దపెద్దవారి అక్రమ కూల్చివేతలు ఫర్వాలేదు కానీ... పేదల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆ పార్టీ అంటోంది. హైడ్రా కూల్చివేతలపై బీజేపీ నేతలు సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి, మేడ్చల్ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. హైడ్రా కూల్చివేతలపై వీరు చర్చించారు.

చెరువులు, నాలాలను ఆక్రమిస్తూ నిర్మించిన కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో బీజేపీ డిమాండ్ చేసింది. ఎఫ్‌టీఎల్‌లో పట్టా భూములు ఉన్న పేదలకు ప్రత్యామ్నాయం చూపాలని పేర్కొంది. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ హైడ్రా కూల్చివేతలు జరిపితే ఊరుకునేది లేదని బీజేపీ హెచ్చరించింది. అయితే పెద్దవాళ్లు అక్రమంగా నిర్మించిన కట్టడాల కూల్చివేతలను బీజేపీ సమర్థించింది. కానీ పేద, మధ్య తరగతి ప్రజల ఆస్తులను కూల్చివేస్తే న్యాయపోరాటానికి సిద్ధమని చెబుతోంది.

సల్కం చెరువుపై బీజేపీ ట్వీట్

సల్కం చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ బీజేపీ ట్వీట్ చేసింది. 2012లో వ్యవసాయ భూమి ఉండగా, 2024లో ఫాతిమా ఒవైసీ కాలేజి వచ్చిందంటూ శాటిలైట్ ఇమేజ్‌లను జత చేసింది. ఫాతిమా ఒవైసీ... ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కుమార్తె అని వెల్లడించింది. ఈ నిర్మాణాలపై చర్యలు తీసుకునే ధైర్యం హైడ్రా చేయగలదా? అని రేవంత్ సర్కారును ప్రశ్నించింది.


More Telugu News