జమ్మూకశ్మీర్ అభ్యర్థుల జాబితాను వెనక్కు తీసుకున్న బీజేపీ

  • ఉదయం 44 మందితో అభ్యర్థుల జాబితా విడుదల
  • మధ్యాహ్నానికే ఉపసంహరించుకున్న బీజేపీ అధిష్ఠానం
  • పదిహేను మంది అభ్యర్థుల పేర్లతో కొత్త లిస్ట్ విడుదల
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సోమవారం ఉదయం అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం.. మధ్యాహ్నానికే మాట మార్చింది. జాబితాను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సవరించిన పేర్లతో త్వరలోనే మరో జాబితా విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలకు దారితీసింది. కాగా, మోదీ సర్కారు మూడో టర్మ్ లో ఇప్పటికే పలు అంశాలపై కేంద్రం యూటర్న్ తీసుకుంది. బీజేపీ కూడా పలు నిర్ణయాలను వాపస్ తీసుకుంది. తాజాగా జమ్మూకశ్మీర్ అభ్యర్థుల జాబితాను ఉపసంహరించుకుంది. ఆ కాసేపటికే మళ్లీ 15 మంది అభ్యర్థుల పేర్లతో ఫ్రెష్ లిస్ట్ ను విడుదల చేసింది.

అసలేం జరిగిందంటే..
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. మూడు రోజుల కిందట తొలి విడత పోలింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జమ్మూకశ్మీర్ లో ఎన్నికల హడావుడి నెలకొంది. మేనిఫెస్టో విడుదల, అభ్యర్థుల జాబితాల ప్రకటనలతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే బీజేపీ కూడా సోమవారం ఉదయం 44 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించింది. అయితే, మధ్యాహ్నం ఈ జాబితాను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 

ఈ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తామని కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పటికే ప్రకటించాయి. అయితే, ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలో పేచీ ఏర్పడింది. అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్ఠానం.. సోమవారం ఉదయం ఇద్దరు సీనియర్ నేతలను కశ్మీర్ కు పంపించింది. చర్చల తర్వాత సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరిందని మధ్యాహ్నం కాంగ్రెస్, ఎన్సీ పార్టీలు ప్రకటించాయి. ఈ ప్రకటన తర్వాత బీజేపీ తన అభ్యర్థుల జాబితాను వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.


More Telugu News