కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసు.. పాలిగ్రాఫ్ టెస్టులో సంచలన విషయాలు వెల్లడించిన నిందితుడు

  • తాను సెమినార్ హాల్‌లోకి వెళ్లేసరికే ఆమె మరణించి ఉన్నట్టు చెప్పిన సంజయ్ రాయ్
  • మృతదేహాన్ని చూసి భయంతో పారిపోయానని వెల్లడి
  • పాలిగ్రాఫ్ టెస్టులో అనేక తప్పుడు, నమ్మశక్యం కాని సమాధానాలు
కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు తెగబడిన కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్‌కు నిర్వహించిన పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) టెస్టులో సంచలన విషయం వెలుగుచూసినట్టు తెలిసింది. తాను సెమినార్ హాల్‌లోకి వెళ్లేసరికే ఆమె మరణించినట్టు ఉందని సంజయ్ రాయ్ చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని ఇటీవల కోర్టుకు చెప్పిన నిందితుడు.. ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్టులో కూడా ఇలాగే చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఈ పాలిగ్రాఫ్ పరీక్షలో అనేక తప్పుడు, నమ్మశక్యం కాని సమాధానాలు వచ్చినట్టు తెలిసింది. ఈ పరీక్షకు హాజరైన నిందితుడు ఆందోళనగా కనిపించినట్టు తెలిసింది. తాను సెమినార్ రూములో అడుగుపెట్టే సరికే వైద్యురాలు మృతిచెంది కనిపించిందని, దీంతో తాను భయంతో పారిపోయానని చెప్పినట్టు సమాచారం.

వైద్యురాలిపై హత్యాచారం తర్వాత అరెస్ట్ అయిన సంజయ్‌రాయ్ తొలుత నేరాన్ని అంగీకరించాడు. అయితే, ఇటీవల మాత్రం యూటర్న్ తీసుకున్నాడు. తాను అమాయకుడినని, తనను ఉద్దేశపూర్వకంగా ఇందులో ఇరికించారని వాపోయాడు. అసలు ఆమెపై అత్యాచారం, హత్య జరిగిన విషయం కూడా తనకు తెలియదని జైలు గార్డ్స్‌తో చెప్పినట్టు కూడా తెలిసింది. ఇదే విషయాన్ని గత శుక్రవారం సీల్దాలోని అదనపు చీఫ్ మేజిస్ట్రేట్ ఎదుట కూడా చెప్పాడు. అయితే, అతడు దర్యాప్తు అధికారులను తప్పుదారి పట్టిస్తున్నాడని అధికారి ఒకరు తెలిపారు.


More Telugu News